ప్రజాశక్తి-గుంటూరు : ఇంజినీరింగ్ విద్యలో కీలకమైన పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల సీట్ల భర్తీలో ఈసారి తీవ్ర జాప్యం నెలకొన్నది. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ చాలా వేగంగా ప్రారంభించినా ఆదిలోనే హంసపాదు పడింది. గత రెండు నెలలుగా అడ్మిషన్ల ప్రక్రియ నిలిచింది. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన లేదు. దీంతో జిల్లాలో వేలాది మంది డిప్లోమా కోర్సులు అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులు ఇతర కోర్సులకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది ఇంటర్, ఇతర కోర్సుల్లో చేరినట్లు తెలుస్తోంది.
తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 15 నాటికి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ అడ్మిషన్ల కేటాయింపు పూర్తి కాలేదు. కౌన్సెలింగ్‌లో జాప్యం ఈ ఏడాది డిప్లోమా కోర్సుల్లో అడ్మిష్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం అవురyంది. ఇప్పటికే సరైన ఆదరణ లేక కునారిల్లుతున్న పాలిటెక్నిక్ కాలేజీలు ఇలాంటి చర్యల వల్ల మరింత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మే 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి, 20న ఫలితాలు విడుదల చేశారు. జూన్ మొదటి వారంలో అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి, కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సిన సమయంలో కౌన్సెలింగ్ నిలిచిపోయింది. రెండు నెలలుగా విద్యార్థులు ఎదరు చూశారు. కానీ దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనేమీ విడుదల కాలేదు. దీంతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించాలని భావించిన చాలా మంది రెండు నెలలపాటు ఎదురు చూసి, ఇతర కోర్సులకు వెళ్లిపోయారని తెలుస్తోంది. కాగా ఒక వారంలో కాలేజీల ఎంపికకు ఆప్షన్లకు అవకాశం ఇస్తారనే సమాచారం ఉన్నతాధికారుల నుండి వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులు చాలామంది ఇతర కోర్సులకు వెళ్లిన నేపథ్యంలో ఎంత మేరకు డిప్లోమా సీట్లు భర్తీ అవుతాయోననే అనుమానం నెలకొన్నది. సివిల్, మెకానికల్ వంటి కోర్ బ్రాంచీల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో గుంటూరు, క్రోసూరు, నల్లపాడు, పొన్నూరు, రేపల్లె ప్రాంతాల్లో ఏడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. బీటెక్ చేయాలని భావించే వారు ఇంటర్ కంటే డిప్లోమా కోర్సుల మంచిదనే భావన ఉంది. బీటెక్ చేయలేకపోయినా డిప్లోమాతో ఉద్యోగావశాలు ఉండటంతో పేద విద్యార్థులు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ప్రభుత్వ కాలేజీల్లో డిప్లామా విద్యకు మంచి డిమాండ్ ఉంది. గుంటూరు నగరంలో బాలికల కోసం హాస్టల్ వసతితో కూడిన విద్య ఉండటంతో ఈ కాలేజీకి రాష్ట్రంలోని పలు జిల్లాల విద్యార్థులూ వచ్చి చేరుతారు. గార్మెంట్ టెక్నాలజీ వంటి రాష్ట్రంలో ఎక్కడా లేని కోర్సు కూడా ఇక్కడ ఉంది. నల్లపాడులోని ఎంబిటిఎస్ కాలేజీలో అడ్మిషన్లకూ మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడా పరిస్థితి ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి. ఇక అనేక ఇంజీనీరింగ్ కాలేజీల్లోనూ డిప్లోమా కోర్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలిపి సుమారు 4 వేలకుపైగా సీట్లు ఉంటాయి. ఈసారి అందులో సగమైనా భర్తీ అవుతాయో లేదో అనుమానమే.










