Jan 29,2023 00:01

డిపిఓకు సమస్యను చెపుతున్న గ్రామస్తులు



ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామంలో పెద్ద వీధిలో నెలకొన్న మురుగు నీటి సమస్య పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారి శిరిషా రాణిని గ్రామస్తులు కోరారు. గత ఏడు సంవత్సరాల నుండి పెద్ద వీధిలో డ్రైనేజీ నిర్మాణాలకు ఆటంకం ఏర్పడటంతో మురుగు నీరు పోవడానికి అవకాశం లేకుండా పోయిందని, దీంతో రోడ్డుపై ఉండి పోతుందన్నారు. చాలాకాలం నుండి నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతుందని, దీంతో దోమలు ప్రబలి, రోగాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లడంతో సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని డిపిఓను ఆదేశించడంతో ఆమె శనివారం సమస్యను నేరుగా పరిశీలించారు. పెద్ద వీధిలో నివాసం ఉంటున్న వారంతా సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం పెద్ద వీధిలో జిరాయతీ భూములు ఉన్న వారు 9 అడుగుల స్థలం వదిలి ఇల్లులు నిర్మించుకోకుండా గ్రామ కంఠం స్థలం అక్రమించారని, సర్వే చేసి పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని సర్వేయర్‌ను ఆదేశించారు. అక్రమంగా గ్రామకంఠంలో నిర్మించుకున్న ఇల్లులను తొలగించాలని వెంకటనారాయణ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ను ఆదేశించారు.