Jul 07,2023 21:56

సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు

పార్వతీపురంటౌన్‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వరమే డిపాజిట్లు చెల్లించి మానసిక ఒత్తిడి నుంచి, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక బెలగాం రైతు బజార్‌ సమీపంలో గల ప్రభుత్వ రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ సంఘ భవనంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు అధ్యక్షతన శుక్రవారం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ముఖ్య అతిధులు అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్‌ రెడ్డి అగ్రిగోల్డ్‌ ఏజెంట్లకు కస్టమర్లకు హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం డిపాజిటర్ల ఓట్లు కొల్లగొట్టి ఆ పదవి వచ్చాక కంపెనీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 'మాట తప్పను' 'మడమ తిప్పను' అని పాదయాత్ర సందర్భంగా పదే పదే అగ్రిగోల్డ్‌ బాధితులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తక్షణమే యుద్ధప్రాతిపదికన డిపాజిట్‌ దారులకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 15లోగా బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆగస్టు 30న విజయవాడలో నిర్వహించనున్న నిరసన పోరాటాల్లో ప్రతి బాధితుడు హాజరై భవిష్యత్‌ పోరాటాల్లో భాగస్వామి కావాలని బాధితులను కోరారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ సమస్యను తమ అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని, భవిష్యత్‌ పోరాటాలకు తమ పార్టీ తరపున మద్దతు ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ నాయకులు వంగల దాలినాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన హామీ యుద్ధప్రాతిపదికన డిపాజిట్లను వారికి అందచేయాలని, దీనిపై అసోసియేషన్‌ చేసే పోరాటాలకు తమ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతామని అన్నారు. బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధనాయుడు, టిడిపి సీనియర్‌ నాయకులు గర్భాపు ఉదయభాను, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బడే గౌరినాయుడు, జనసేన జిల్లా నాయకులు అన్నాబత్తుల దుర్గాప్రసాద్‌, కె. విశ్వేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు పి. రంజిత్‌ కుమార్‌, లోక్‌ సత్తా జిల్లా అధ్యక్షులు కె.పాపారావు, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు పి.సంగం, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొత్స నర్సింగరావు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు ఎస్‌.విశ్వేశ్వరరావు, అగ్రిగోల్డ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, నాయకులు ఆర్‌. ఆదినారాయణ, బిటిఆర్‌ నాయుడు, వై. గోవింద, వెంకటరమణ, ఆర్‌. మురళీ డాక్టర్‌, పి.ఈశ్వర నారాయణ, యశోద, రమాదేవి, మారోజు వెంకట్రావు, బంగారి, శ్రీరాములు, బివి రమణ, అశోక్‌ అధిక సంఖ్యలో అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్లు పాల్గొన్నారు.