Jul 18,2023 01:37
పోస్టాఫీసు ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బాధితులు

ప్రజాశక్తి-కొల్లూరు: కొల్లూరు మండలం క్రాప గ్రామంలో పోస్టాఫీసులో సుమారు 60 మంది పైగా చేసుకున్న 30 లక్షల డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కొల్లూరు హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు బొనిగల సుబ్బారావు మాట్లాడుతూ క్రాప పోస్టాఫీస్‌లో గత 18 నెలల క్రితం దళితులు, పేదలు దాచుకున్న సొమ్మును పోస్టుమాస్టర్‌ ఎం శరత్‌కు డిపాజిట్‌ చేశామని తెలిపారు. సుమారు రూ.30 లక్షలకు పైగా ఓచర్లు సరిలేక, కట్టిన డిపాజిట్‌ ఏమైందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇటీవల సమాచారాన్ని వెలుగులోకి తీసుకువచ్చి పేదలు కట్టిన సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేయగా రూ.15 లక్షలు కట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. దీంతో పోస్ట్‌ మాస్టర్‌ శరత్‌ అమౌంట్‌ మొత్తం బాపట్ల హెడ్‌ ఆఫీస్‌లో ఉండే పోస్టుమాస్టర్‌ నూకరాజుకు చెల్లించినట్లు చెప్పారని, నూకరాజు ఆ అమౌంటును నేటికీ క్రాప బాధితులకు చెల్లించకపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఆ సొమ్మును చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పోస్టాఫీసుకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాజ్యలక్ష్మి పోలీస్‌ సిబ్బందితో ధర్నా ప్రాంతానికి చేరుకొని నూకరాజుతో మాట్లాడి ప్రతి ఒక్కరూ సొమ్మును చెల్లించే విధంగా హామీ తీసుకుని బాధితలతో ఆందోళన విరమింపచేశారు. ఈ నెల 31వ తేదీలోగా ప్రతి ఒక్కరి సొమ్మును నూకరాజు చెల్లించే విధంగా ఒప్పుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులు రాజు, సీతా మహాలక్ష్మి, తిరుపతమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.