Aug 02,2023 23:10

మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎన్‌జిఒ నాయకులు

- నెరవేరుతాయనే నమ్మకం ఉంది
- రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
- ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్లలో కొన్ని నెరవేరాయని, మిగిలిన వాటి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఉద్యోగులతో సమావేశమయ్యేందుకు జిల్లాకు బుధవారం వచ్చిన ఆయన స్థానిక ఎన్‌జిఒ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాల చెల్లింపు, అన్ని జిల్లాలకు సమానంగా 16 హెచ్‌ఆర్‌ఎ వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. మరికొన్ని డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం తమకుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పిఆర్‌సి కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామని, నిర్బంధాలనూ ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం ఒక నెల ముందుగానే పిఆర్‌సి కమిషన్‌ వేసిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆరు నెలల జిపిఎఫ్‌, సరెండర్‌ లీవులకు సంబంధించి రూ.900 కోట్లు బకాయిలున్నాయని, మహాసభలకు ముందే చెల్లిస్తే బాగుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, సిఎఫ్‌ఎంఎస్‌లో వారిని ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నట్లు నమోదు చేయడంతో వారు సంక్షేమ పథకాలను కోల్పోతున్నారని చెప్పారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పిఆర్‌సి కంటే ముందే జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ కేడర్లకు చెల్లిస్తున్న వేతనాలను వారికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వరంగ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న మహాసభలకు జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి శివారెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదని, ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని, ట్రస్టుకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తోందని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.