Mar 07,2021 17:55

ఓ తరుణీ!
అనితర సాధ్యమైన ఓరిమితో
వసుధను తలపింపచేస్తూ
అటు పుట్టినింటికి,
ఇటు మెట్టినింటికి
కాకపోతే... ఏకాకిగానైనా
ధీర నాయికవై వెలుగుచూపుతూ
అవనిలోనే కాదు,
ఆకాశంలో సగమైనా
పురిటినొప్పుల బాధ తెలియని
పురుషజాతికి తల్లివైనా
బాల నుండి వయోవృద్ధ వరకు
వయోభేదం లేకుండా దాడులు

కాలమెంత మారినా...
ఎంత పురోగతి సాధించినా
వదల్లేదు నిన్ను వివక్ష
ఎందుకు నీకీ వేధింపులు?
ఆడతనమే పాపమా?
అణకువే శాపమా?
బాధలను భరిస్తూ,
అనుక్షణం శ్రమిస్తూ
ఎవరో వస్తారని,
ఏదో చేస్తారని ఎదురుచూడకు

ఓ వనితా!
దీపమై వెలుగు చూపగలవు
జ్వలించి భగభగ దహించగలవు
అభి'మానం' గాయపడిన సమయాన
శివమెత్తిన శివంగివలె తెగువచూపు
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా
మదమెక్కిన చీడను సంహరించు.

చురకత్తివై, అణుబాంబువై
ఆశాదీపమై కదలిరా!
అణగారిన బతుకులకు
మార్గదర్శిగా నిలువు
ప్రగతికి నీవే దిక్సూచివి కావాలి
అందుకు మహిళాదినోత్సవమే
శుభారంభమవ్వాలి
మేలుకో వనితా ...లోకాన్ని ఏలుకో

                                     * వేమూరి శ్రీనివాస్‌, 9912128967