ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్, సామర్లకోట రూరల్ ప్రజల స్థిరాస్తులకు భద్రత, రక్షణ లేని విధానంలో రూపొందిన డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ దస్తావేజుల లేఖరులు బుధవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చి లేఖర్లను రోడ్లు పాలు చేస్తోందన్నారు. సబ్ రిజిస్ట్రర్ కార్యాలయ పరిధిలో ఉపాధి పొందుతున్న లేఖర్లకు అలాగే ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ కల్పించే పాత రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. కాకినాడలోని ఈ కొత్త ప్రైమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ వల్ల అమ్మకందారులకు, కొనుగోలుదారులకు, భూ యజమానులకు ఎటు వంటి రక్షణ ఉండకపోగా వారికి నష్టం కలిగిస్తుందని చెప్పారు ఈ విధానాన్ని మార్పు చేయాలని పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని బుధ, గురువారాల్లో పెన్‌డౌన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి కొనుగోలు, అమ్మకం దారులు సహ కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే తమ అభిప్రా యాన్ని మార్చుకొని పాత విధానాల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ ఐదు లక్షల లేఖర్ల కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ నిరసనలో రాష్ట్ర లేఖరుల సంఘం అధ్యక్షుడు బిజె ప్రసాద్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు చోడపునీడి గోవిందు, కార్యదర్శి గీసాల శ్రీను, కాకినాడ సిటీ అధ్యక్షుడు జాడ అప్పలరాజు, లేఖర్లు వివివి సత్యనారాయణ, సత్య ప్రసాద్, పివివి రమణ, డీజే మోహన్ రావు, సత్తిబాబు పాల్గొన్నారు.
దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో సామర్లకోట రూరల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. దస్తావేజు లేఖర్ల స్టీరింగ్ కమిటీ చైర్మన్ మల్యాల సీతాపతిరావు మాట్లాడుతూ 2.0 దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ప్రకారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడితే అనేక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఈ పద్ధతిలో ఆస్తిని కొనుగోలు, అమ్మకాలు చేసిన వారికి లీగల్ సమస్యలు తలెత్తుతాయఅన్నారు. 2.0 సాఫ్ట్‌వేర్‌లో రక్షణ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో లేఖర్ల సంఘం గౌరవాధ్యక్షుడు గోగు అప్పారావుచ కార్యదర్శి పేకేటి చినపుత్రయ్య, సుతి వెంకట్, షేక్ లాల్ మహమ్మద్, తుమ్మల సూరిబాబు, బిఎన్‌వి.ప్రసాద్, దిట్ట కవి వెంకటచలపతి, మామిడాల రాజేశ్వరరావు, వి.సుబ్బారావు, గొల్ల అబ్బాయి, పేకేటి రమేష్, గొంచాల బాబులు తదితరులు పాల్గొన్నారు.










