Sep 20,2023 22:28

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును పంచాయతీకి జమ చేయకుండా పలువురు సిబ్బంది వాటిని తమ సొంతానికి వినియోగించుకుంటున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. మరోవైపు వివిధ గ్రాంట్లు, ఆర్థిక సంఘాల నుంచి వస్తున్న నిధుల వినియోగం కొన్నిచోట్ల దుర్వినియోగం అవుతోంది. అధికార పక్షానికి చెందిన నాయకులు తమ ఇష్టారీతిన నిధులను ఖర్చు చేస్తూ లెక్కలు కూడా చూపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని మేజర్‌ పంచాయతీల్లో అధికారులు, నాయకులు కుమ్మక్కై పెద్ద ఎత్తున నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రారంభం కాని క్యాష్‌ లెస్‌ పేమెంట్స్‌
గ్రామాల్లో పన్నుల వసూలు నుంచి మొదలుకొని నిధుల ఖర్చు వరకూ పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ పేమెంట్స్‌ విధానాన్ని అమలు చేయాలని భావించింది. గత నెల 15 నుంచి అన్ని పంచాయతీల్లో అమలు చేయాలని ఆదేశించింది. జిల్లాలో 20 మండలాల్లో 385 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 3 వేలు జనాభా ఉన్న పంచాయతీలు 198, మూడు వేలు పైనే జనాభా ఉన్న పంచాయతీలు 187 ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ లావాదేవీల కోసం 358 పంచాయతీలకు ఇప్పటికే అధికారులు బ్యాంకు ఖాతాలను తెరిచారు. నెల రోజులు దాటుతున్నా నేటికీ డిజిటల్‌ చెల్లింపులు జిల్లాలో ఎక్కడా ప్రారంభం కాలేదు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
లావాదేవీలకు పరికరాలే కీలకం
3 వేలు లోపు ఉన్న పంచాయతీలకు క్యూఆర్‌ కోడ్లు, ఆపై జనాభా ఉన్నవాటికి పర్చేస్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) పరికరాల ద్వారా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించాల్సి ఉంది. వీటిని నేటికి బ్యాంకులు అందజేయలేదు. క్యాష్‌లెస్‌ చెల్లింపులు కోసం ఇప్పటి వరకు 61 పంచాయతీలకు మాత్రమే క్యూఆర్‌ కోడ్‌లు, 36 మాత్రమే పీవోఎస్‌ పరికరాలు బ్యాంకులు అందించాయి. పూర్తిస్థాయిలో ఈ పరికరాలు ఇస్తేనే గాని లావాదేవిలు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులోకి వస్తే వెంటనే వాటిని జిరాక్స్‌లు తీయించి పంచాయతీల్లో ఏర్పాటు చేస్తే ప్రజలు వీటి ద్వారా పన్నులు, ఇతర లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అయితే డిజిటల్‌ పేమెంట్స్‌ విధానం జిల్లాలో ఎప్పటి నుంచి అమలు అవుతుందనేది ఇంకా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు త్వరలోనే ఈ విధానాన్ని అన్ని పంచాయతీల్లోనూ అమలు చేస్తామని, ఇక నుంచి ఆస్తి పన్ను ఇంటి పన్ను షాపుల అద్దెలు, లే అవుట్లు, భవన నిర్మాణ అద్దెల అనుమతి కోసం రుసుములు, లైసెన్సుల ఫీజులు ఇలా అన్నీ క్యాష్‌ లెస్‌ పేమెంట్స్‌ రూపంలోనే వసూలు చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి విక్టర్‌ చెప్పారు. క్యూఆర్‌ కోడ్లు, పిఒఎస్‌ పరికరాలు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.