ప్రజాశక్తి-పాడేరు: నాడు నేడు మొదటి విడత పనులు పూర్తైన పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూములను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో విద్య, గిరిజన సంక్షేమ, ఇంజినీరింగ్, డిఆర్డిఎ అధికారులు, ఏమ్పిడిఓలతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎంపిక చేసిన ప్రాధమిక పాఠశాలలకు స్మార్ట్ టివిలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరేక్టివ్ ఫ్లాట్ పేనల్స్ ప్రభుత్వం అందిస్తుందని, అందుకు తగిన ఇంటర్నెట్ కనెక్టివిటి, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధిత ప్రదానోపాద్యాయులు భాద్యత వహించాలని తెలిపారు. జగనన్న విద్యా కానుక కిట్లను సకాలంలో పంపిణీ చేయాలని, బూట్ల సైజులో హెచ్చు తగ్గులుంటే వెంటనే యాప్‌లో అప్లోడ్ చేసి వాటిని రిప్లేస్ చేయాలని ఆదేశించారు. యూనిఫాం మెటీరియల్ కుట్టించడానికి మండలాల వారీగా టైలర్లను గుర్తించి వెంటనే పనులు అప్పగించాలన్నారు. విద్యార్ధులు పాఠశాలలకు యూనిఫారంలో హాజరు అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఎంఇఓ, ఎటిడబ్ల్యుఓ, ఎంపిడిఓ, ఎపిఎం లు కమిటీగా మండల స్థాయి స్టోర్ పాయింట్‌కు వచ్చిన జగనన్న విద్యా కానుక కిట్లను వెంటనే సంబందిత పాఠశాలలకు పంపించడంతో పాటు వెంటనే విద్యార్ధులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. పంపిణీలో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్రధానో పాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయులు బయో మెట్రిక్ హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసారు. నాడు-నేడు పనులలో నాణ్యత పాటించాలని, ముఖ్యంగా మేజర్ అండ్ మైనర్ మరమ్మత్తును జూలై పదవ తేదీ లోపు, విధ్యుత్ పనులు జూలై 15, టాయిలెట్ల పనులను 20వ, తాగు నీటి పనులను 25వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా విధ్యుత్, తాగు నీరు, టాయిలెట్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఎంపిడిఓలు తరచూ సమీక్షలు నిర్వహించి లక్ష్య సాధనకు కషి చేయాలన్నారు. ఈ సమీక్షలో సహాయ కలక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం భాష, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కొండలరావు, డిఆర్డిఎ పిడి వి.మురళి, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపిడిఒలు, ఎటిడబ్ల్యుఓలు, ఎంఇఓలు, తదితరులు పాల్గొన్నారు.










