May 16,2023 01:19
మాట్లాడుతున్న మణిలాల్‌

ప్రజాశక్తి-రేపల్లె: మత్స్యకార భరోసా పంపిణీకి రేపల్లె నియోజకవర్గానికి వస్తున్న ముఖ్యమంత్రి రేపల్లె నియోజకవర్గంలో దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ అన్నారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీరప్రాంత అభివృద్ధి కోసం కొత్త పరిశ్రమలు ప్రకటన చేయాలని, నియోజకవర్గంలో ఉన్న రేపల్లె మున్సిపల్‌ పట్టణంలో సుమారు 1300 మంది టిడ్కో లబ్ధిదారులు పేదలకు టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వం ప్రారంభించింది. లబ్ధిదారుల దగ్గర నుంచి రూ.12,500 నుంచి రూ.లక్ష వరకు లబ్ధిదారులు మునిసిపాలిటీకి డిడిలు జమ చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే డబ్బులు తిరిగి ఇస్తాము, టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు, కానీ రేపల్లె పట్టణంలో గత ప్రభుత్వం చేసిన నిర్మాణం తర్వాత ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పెట్టి నిర్మాణం పని చేయలేదని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి రేపల్లె నియోజకవర్గంలో కీలక సమస్యగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని అన్నారు. రేపల్లె నియోజకవర్గంలో మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయటానికి శ్మశాన స్థలాలు లేకపోవడంతో కాలువకట్టల మీద, రోడ్లపక్కన శవాలను పూడ్చిపెడుతున్న అనేక దళిత గ్రామాలు, బీసీ వాడలు రేపల్లె నియోజకవర్గంలో నేటికీ ఉన్నాయి. నియోజకవర్గంలో దళితవాడలకి శ్మశాన స్థలాలు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రధానంగా రేపల్లె కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధి చేయాలన్నారు. సిపిఎం నేతలు కే ఆశీర్వాదం, కేవీ లక్ష్మణరావు, జె ధర్మరాజు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.