
ప్రజాశక్తి - వేటపాలెం
చట్ట విరుద్ధంగా లైసెన్స్ లేకుండా దీపావళి మందు గుండు సామాగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. మండలంలోని అక్కాయపాలెంలో ఉన్న దీపావళి మందు గుండు సామాగ్రి నిల్వచేసిన గోడౌన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ పరిమితి, తీసుకుంటున్న భద్రతా చర్యలు, అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని సిఐలు, ఎస్సైలు దీపావళి ముందు గుండు సామాగ్రి తయారీ, అమ్మకం, నిల్వ చేసే ప్రదేశాలను తనిఖీ చేసి భద్రతాపరమైన చర్యలను పరిశీలించాలని అన్నారు. జిల్లాలో ఎవరైనా లైసెన్స్ లేకుండా చట్ట విరుద్ధంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత మూడు రోజులలో బాపట్ల, అద్దంకి పట్టణాలలో అక్రమంగా నిల్వచేసిన దీపావళి మందు గుండు సామాగ్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా ఎవ్వరూ నిల్వ చేయవద్దని అన్నారు. దీపావళి మందులు విక్రయించదల్చిన వాళ్లు తాత్కాలిక అనుమతులు పొంది, షాపుల వద్ద నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా జనసంచార స్థలాల్లో విక్రయాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. మందు గుండు సామాగ్రి రసహ్యంగా తయారు చేస్తున్నట్లు గమనిస్తే 100, 112కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పి ఎస్ ప్రసాదరావు, ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ వి సూర్యనారాయణ, చీరాల టూ టౌన్ సిఐ కె సోమశేఖర్, ఎస్‌ఐ జి సురేష్ ఉన్నారు.