పండుగ అనగానే టక్కున గుర్తొచ్చే పిండి వంటలు స్వీట్లు. అందులోనూ దీపావళి పండగనగానే వెరైటీ స్వీట్లు పంచుతూ ఉంటారు. అయితే సాధారణంగా స్వీట్లను షాపుల్లో తెచ్చుకుంటుంటాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అలాంటి వాటికి స్వస్తిపలికి, అవే వెరైటీ స్వీట్లను ఇంట్లో తయారుచేసుకోవడం ఉత్తమం. ఈ దీపావళికి ప్రత్యేకంగా చేసుకుని ఆస్వాదించే ఆ స్వీట్లేంటో తెలుసుకుందాం..!
కోవా -క్యారెట్ హల్వా
కావాల్సిన పదార్థాలు : క్యారెట్లు-1 కేజీ (తురుము), పాలు-2 లీటర్లు, కోవా-150గ్రా, పంచదార-కప్పు, నెయ్యి-2 టీస్పూన్లు.
గార్నిషింగ్ కోసం : జీడిపప్పు- 12, బాదం- 12, యాలకుల పొడి- చిటికెడు.
తయారుచేసే విధానం : ముందుగా డీప్ బాటమ్ పాన్‌లో పాలు పోసి, బాగా మరిగించాలి.
అడుగు అంటుకోకుండా మధ్యమధ్యలో స్పూన్‌తో కలియబెడుతుండాలి.
45-50 నిముషాలు బాగా మరిగాక, పాలు చిక్కగా/ క్రీమీగా మారుతున్న సమయంలో అందులో క్యారెట్ తురుమును వేసి, బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
అలాగే పాలు, క్యారెట్ బాగా ఇగిరిపోయేలా ఉడికించాలి.
పాలు మొత్తం క్యారెట్‌తో ఇంకిపోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో డీప్ పాన్‌లో నెయ్యి వేసి, వేడి చేసి అందులో పాలలో ఉడికించుకున్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి, బాగా మిక్స్ చేయాలి.
ఇలా నెయ్యిలో మిక్స్ చేస్తూ, కోవా, పంచదార వేస్తూ.. మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద మరో 10-15 నిముషాలు ఉడికించుకోవాలి.
పంచదార పూర్తిగా క్యారెట్ మిశ్రమంలో కలిసిపోయే వరకూ సన్నని మంటపై కలుపుతుండాలి. అంతే కోవా క్యారెట్ హాల్వా రెడీ. ముందుగా కట్ చేసి పెట్టుకొన్ని నట్స్‌తో గార్నిష్ చేసి, వేడి లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు.
బెల్లం సున్నుండలు
కావాల్సిన పదార్థాలు : మినపప్పు-కేజీ, బెల్లం-కేజీ (బెల్లం ఇష్టపడనివాళ్లు పంచదార వేసి ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు), నెయ్యి - తగినంత (ఉండలు చుట్టడానికి).
తయారుచేసే విధానం : ముందుగా స్టౌపై పాన్ పెట్టి, సన్న మంటపై మినపప్పును దోరగా, కమ్మని వాసన, బంగారు రంగు వచ్చేంతవరకూ వేయించుకోవాలి.
వేయించిన మినపప్పును చల్లారాక మిక్సీలో మెత్తగా పొడిచేసుకోవాలి. దానిని ఒక బేసిన్‌లో వేయాలి.
సన్నగా తరిగిన బెల్లం తురుమును ఈ పిండిలో వేసి, బాగా కలిపి ఇందులో మరిగించిన నెయ్యివేసి, బాగా కలపాలి. వీటిని మనకు ఇష్టమైన సైజుల్లో ఉండలు చుట్టుకోవాలి. అంతే రుచికరమైన సున్నుండలు రెడీ.
రసమలై
కావాల్సిన పదార్థాలు : పాలు-లీటరు, పంచదార-2 కేజీలు, పచ్చికోవా-50గ్రాములు, కుంకుమపువ్వు-చిటికెడు.
తయారుచేసే విధానం : ముందుగా పాలను బాగా కాచుకోవాలి.
అందులో రెండు చుక్కల నిమ్మరసం పిండి పాలను విరగ్గొట్టాలి.
తరువాత ఒక సన్నటి క్లాత్‌లో పాల మిశ్రమాన్ని పోసి, మూతి బిగగట్టి వేలాడదీయాలి.
నీళ్లన్నీ పోయి, గట్టి ముద్ద మిగులుతుంది. దాంట్లో పచ్చికోవాను వేసి మెత్తగా కలిపి ఉండలుగా చేసి, గారెల్లాగా వత్తుకోవాలి.
ఈలోగా పంచదారను లేతపాకం పట్టి ఉంచాలి. మరుగుతున్న పాకంలో పైన తయారుచేసిన ఉండలను వేసి, సన్నటి మంట మీద ఉడికించాలి.
ఇవి ఉడికేలోగా వేరే గిన్నెలో పాలుపోసి, దాంట్లో సగం కప్పు పంచదార, చిటికెడు కుంకుమపువ్వు, పచ్చికోవా వేసి చిక్కబడేదాకా మరిగించాలి.
ఆపై పాకంలో ఉడికించిన ఉండలను కోవా మిశ్రమంలో కలిపి చల్లారబెట్టి, ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
చల్లబడిన తరువాత తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన రసమలై రెడీ.
మలై గులాబ్ జామూన్
కావాల్సిన పదార్థాలు : క్రీమ్ పౌడర్ మిల్క్-కప్పు, సూజి- 4 టీస్పూన్లు, మైదా- 4 టీస్పూన్లు, పాలు-కప్పు (పిండి తయారుచేయడానికి) బేకింగ్ పౌడర్- 1/2 టీస్పూన్, నెయ్యి- వేయించడానికి తగినంత.
ఫిల్లింగ్ కోసం : క్రీమ్/మలై-కప్పు, కొబ్బరి తురుము -1/2 కప్పు, పంచదార- 2 కప్పులు (సిరప్ కోసం) నీళ్లు-2 కప్పులు.
తయారుచేసే విధానం : ముందుగా మైదాపిండి, సూజి (రవ్వ), పాలపొడి, పాలు, బేకింగ్ పౌడర్, నెయ్యి అన్నింటినీ ఒక బౌల్లోకి వేసి మెత్తగా, మృదువుగా చపాతీ పిండిలా కలిపి 2-3 గంటలపాటు పక్కన పెట్టుకోవాలి.
మూడు గంటల తర్వాత తిరిగి కొద్దిగా పాలు పోసి, మళ్లీ సాఫ్ట్‌గా కలిపి పెట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల పిండి స్టిఫ్‌గా తయారవుతుంది.
ఇప్పుడు స్టౌపై ఫ్రైయింగ్ పాన్‌పెట్టి, అందులో నెయ్యి వేసి వేడి చేయాలి.
మీడియం మంట పెట్టి, నూనె కాగనివ్వాలి.
అంతలోపు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్ది కొద్దిగా తీసుకుని, చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి.
ఉండలు చుట్టే ముందు, చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల తేలికగా సాప్ట్‌గా జామూన్ బాల్స్ తయారవుతాయి.
మరో పొయ్యిమీద పాన్ పెట్టి, నెయ్యి వేసి, వేడయ్యాక అందులో జామూన్ బాల్స్ వేసి, బ్రౌన్ కలర్ వచ్చేవరకూ ఫ్రై చేసుకోవాలి.
బ్రౌన్ కలర్‌లోకి మారగానే వాటిని తీసి, షుగర్ సిరప్‌లో వేసి, పదినిమిషాలు నాననివ్వాలి.
తర్వాత ఒక్కో గులాబ్ జామ్‌కి చిన్న గాటు పెట్టి, లోపల మలైని నింపాలి.
తర్వాత గులాబ్ జామూన్ల మీద తాజా కొబ్బరి తురుమును చల్లి, సర్వ్ చేసుకోవచ్చు.