Feb 28,2021 11:54

అన్నవాహిక భళ్ళున పగిలాక
ఇంకా మిగిలి వున్నదేమిటి
నీలిరంగు సముద్రం సాక్షిగా
వెలుగుసోకిన కంఠస్వరం మినహా

ఆకాశపు నీలిరంగు ప్రతిబింబాన్ని
ఎంత తరిచిచూసినా
కనబడేది అంధకారమే
చీకటిని తొలగిస్తూ, మనుషులు
పరుగు తీస్తున్న దృశ్యం.

వలస భూమి ఏం మాట్లాడుతుంది?
జీవన రేఖలను వలస గీతలుగా
మార్చే కాలయవనికపై
ఎంత కాలమిలా

చేతుల పునాదిపై లేచిన నిర్మాణం
చెమటచుక్కల చల్లదనం
ఆకలిమంటల ఋతురాగం
ఇనుప రజను నృత్య ప్రదర్శన

ఇనుము ఎంతకీ తెగని
సుదీర్ఘ సంభాషణ
నీడ దొరికిన తర్వాత
ఎండను ఆస్వాదిస్తూ వుండలేరు

వికసిత నేలపై వొరిగిన
ఉక్కు శకలం
అగ్నిమాటున జీవన ఊపిరిని
దానం చేసింది.

చేతుల దొంతరలలో
వెలుగు ధారలను
కురిపించిన కరుణ నిండిన సముద్రం
నిటారుగా నిలబడిన ఉక్కు స్తంభం
మనుషులు, కార్మికులై ఇంట్లోకి
దారి చేసుకున్న వేళ

దళారీ భూమిపై లేచిన
ఇనుప కట్టడం
మాతృమూర్తి స్పర్శ కదా
నీటిదాహం తీర్చలేదని
పాల పొదుగులో
కరవాలం దింపలేం
విస్తాపితుల నేల వలసభూమి, నీళ్ళలోకి చందమామలను
విసిరేసిన వేళ్ళపై మొలిచిన
కాసిన్ని ఆశల రేఖలు

అమ్మకం మొదలయింది
చంటి పిల్లల దుఃఖం ఆవిరయింది
నేలపై తారాడిన మట్టి బంధం
సుదూర తీరంలో జీవితం చాలించి
అగ్నిశిఖలో వొదిగాడు.

శ్రమ శిఖరం నిండా
వాలిన రాబందులు
అనేక ఊపిరిలకు ఉరివేసి
రూపాయి కోసం జోలె పడతారు

జనం నాలికలపై నర్తించిన
ఉక్కు పదబంధం
ఉమ్మి నీటిలా కరుగుతుంది

అధైర్య పడవద్దు
మనుషులే కాదు
మౌనంగా వున్న
ఏరాడ కొండ
ఉవ్వెత్తున లేచే సముద్ర కెరటం
ఆ నేలపై అప్పుడే పుట్టిన శిశువు కేక
ప్రతిధ్వనిస్తోంది

విశాఖ తీరం దగ్గరే
ఉక్కు శిఖరం ద్వారం దగ్గరే
భూమిని కోల్పోయిన నిర్వాసితుడు
తన నేలపై పరాజితుడిగా కూర్చున్నాడు.
ఏభై ఏళ్ళ కన్నీరు
ఘనీభవించిన సమయం.

ఉక్కును నిలబెట్టిన భూమి నాది
చివరికి నాకేదీ దక్కలేదు
అయిదు దశాబ్దాలు శోకం నాది

ఇనుప దొంతరల కింద పాతేసి
రూపాయి వంక చూస్తున్నారు.

తల్లి గర్భం నుండి రాలిపడిన
అన్నిటినీ నాలికతో తాకారు
చనుబాలు ద్రవించే చోట
రక్తం ప్రవహిస్తున్నప్పుడు
వేలం పాట పెట్టారు.

అయినా నాదయిన గాత్రం
నాదయిన పాట
ఎన్నటికీ సజీవమే

దీపశకలం బద్ధలయినాక
వేలాది చేతులు
సంకెళ్లు నుంచి విడివడి
ఒకే దిక్కు వైపు గొంతెత్తి
బృందగానం వినిపిస్తున్నాయి.
                            * అరసవిల్లి కృష్ణ, 9247253884