Aug 05,2023 20:59

విచారణకు హాజరై ఆధారాలను ఆర్‌జెడికి సమర్పించిన ఫ్యాప్టో నాయకులు

కడప అర్బన్‌ : ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో, పదోన్నతులలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై శనివారం రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (పాఠశాల విద్య) ఎం.వెంకటకృష్ణారెడ్డి తన కార్యాలయంలో విచారణ చేపట్టారు. డిఇఒ వై.రాఘవరెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతో పాటు, బదిలీలు, పదోన్నతులలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వివిధ ప్రసార మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నాలలో ర్యాలీలలో పాల్గొన కూడదని, పాల్గొంటే సిసిఎ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకుం టామని డిఇఒ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ఈ ఉత్తర్వులను ఉపసంహరిం చుకోవాల్సిందేనని విద్యార్థి, యువజన సంఘాలతో పాటు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుల పట్ల డిఇఒ అభ్యంతరకర భాషను ప్రయోగించడం, ఒక ఉపాధ్యాయుడిని ఫోన్‌ ద్వారా డిఇఒ దూషిస్తున్న వాయిస్‌ మెసేజ్‌ వైరలైయింది. వరుసగా ఆరోపణలు రావడంతో, డిఇఒ వ్యవహార శైలితో పాటు బదిలీలు, పదోన్నతులలో జరిగిన అక్రమాలపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టర్‌, ఆర్జేడీ ఫిర్యాదు చేశారు. ఫ్యాప్టో జిల్లా శాఖ ఫిర్యాదుపై స్పందించిన ఆర్జేడికి బదిలీలు, పదోన్నతులలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం ఫ్యాప్టోకు నోటీసులు పంపారు. ఆ మేరకు శనివారం ఆర్జేడి కార్యాలయంలో జరిగిన విచారణకు ఫ్యాప్టో నాయకులు హాజరై అవినీతి, అక్రమాలపై తమ వద్ద ఉన్న ఆధారాలను ఆర్జేడికి సమర్పించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్‌ మాదన విజయకుమార్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బదిలీ, పదోన్నతులలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరించారని ఆరోపిం చారు. 20 అంశాలపై ఆధారాలతో సహా ఆర్జేడికి అందజేశామన్నారు. పదోన్నతి పొంది మూడేళ్లు దాటిన ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులకు నిబంధనలకు భిన్నంగా రివర్సన్‌ ఇచ్చి వారికి 16 శాతం హెచ్‌ఆర్‌ఎలో నియామకాలు చేపట్టా రన్నారు. పాఠశాల సహాయకులుగా పదోన్నతి ఇచ్చిన కొద్ది రోజులకే వారి కోరిక మేరకు రివర్షన్‌ ఇచ్చి వారందరినీ వారికి అనుకూలమైన 16శాతం హెచ్‌ఆర్‌ఏలో స్థానాలు కట్టబెట్టారన్నారు. దీంతో పాటు జిల్లా విద్యాశాఖాధికారి ఉపాధ్యా యులపై ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. ఆరోప ణలపై ఆధారాలతో పాఠశాల విద్య కమిషనర్‌, మరియు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. విచారణలో ఫ్యాప్టో నాయకులు ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వెంకటసుబ్బయ్య, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు, ఏపీటీఎఫ్‌ (1938) రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఆర్‌.అబ్దుల్లా, బిటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.హరికొండయ్య, ఆర్జేడి కార్యాలయ పరిపాలనాధికారి అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.