
ప్రజాశక్తి - పాలకోడేరు
స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా విద్య శాఖాధికారి ఆర్.వెంకటరమణను గొరగనముడివాసులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. వరుసగా మూడో సారి జిల్లా ఉత్తమ సేవ అవార్డు అందుకున్న డిఇఒకు గొరగనముడికి చెందిన ఎస్‌సి, ఎస్‌టి మానిటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ, మాజీ సర్పంచి చెల్లబోయిన పాపారావు, వైసిపి నాయకులు దిడ్ల రవి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా మూడు సార్లు ఉత్తమ సేవా అవార్డు రావడం అభినందనీయమన్నారు. మంచితనానికి మారుపేరుగా అంకిత భావంతో జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం డిఇఒ మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేసినందుకు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫ్రీ సీట్లను రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాకు 2400 మందికి కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ సీట్లు కేటాయించినందుకు ఉత్తమ సేవా అవార్డు లభించిందని చెప్పారు. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందని తెలిపారు.