Aug 24,2023 21:12

నిరసన తెలుపుతున్న గిరిజనులు

ప్రజాశక్తి గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలం గడసింగుపురం పంచాయతీలో ఇంతవరకు రేషన్‌ బియ్యం ఇవ్వని డీలర్‌పై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కూరంగి సీతారాం మాట్లాడుతూ గడసింగు పురం పంచాయితీలో రేషన్‌ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఏనుగులగూడ గిరిజనులకు ఇంత వరకూ బియ్యం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏనుగులగూడలోనే కాకుండా బూరి రామినాయుడువలస, గడసింగుపురం గ్రామాలకు కూడా గత రెండు నెలల నుంచి రేషన్‌ బియ్యం ఇవ్వలేదని అన్నారు. గిరిజనులకు సక్రమంగా రేషన్‌ బియ్యం ఇవ్వని డీలర్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వెంటనే గడసింగు పురం పంచాయితీలో రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు ఎం రామారావు పాల్గొన్నారు.