ప్రజాశక్తి-భట్టిప్రోలు: చేనేత పరిశ్రమ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏప్రిల్ 3,4 తేదీలలో జరిగే 36 గంటల సామూహిక దీక్షలను చేనేత, అనుబంధ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు గొట్టిముక్కల బాలాజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేతకు ప్రభుత్వం విధించిన జిఎస్టీని ఎత్తివేయాలని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. క్షీణిస్తున్న చేనేత రంగాన్ని అన్ని విధాలా అదుకుంటామని గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా మరమగ్గాలు ఏర్పాటు చేసి చీరలు తయారు చేస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో చేనేత వస్త్ర నిల్వలు పేరుకుపోయి కార్మికులకు ఉపాధి లేకుండాపోయిందన్నారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కల్పించాలని, ఆత్మహత్యలు చేసుకున్న కార్మికులకు రూ.1.50 నుంచి రూ.5 లక్షలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, జిఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహనరావు, రూపానంద్ తదితరులు పాల్గొన్నారు.










