దీక్షలు కొనసాగిస్తాం.. : టిడిపి
ప్రజాశక్తి-కావలి : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కావలి నియోజకవర్గ టిడిపి కార్యాలయం వద్ద టిడిపి కుటుంబ సభ్యులతో శుక్రవారం 16వ రోజు రిలే నిరాహార దీక్షలు ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. పేద ప్రజలను అంధకారంలోకి నెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ వైసిపి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ఈరోజుటికీ చంద్రబాబునాయుడును 21రోజులుగా జైలులో ఉంచారని, తాము 16 రోజులుగా శాంతి యుతంగా ఈ రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నామన్నారు. కనీసం ఆయనకు జైలులో మంచి వసతులు కూడా కల్పించకుండా కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమంలో అర్హత పొంది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. నెల్లూరు, కావలి పట్టణంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు యథాతథంగా ఇప్పటికీ సాగుతున్నాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబును అక్రమ అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. ఇటువంటి కక్షసాధింపు సిఎంను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఇకపై చూడబోరన్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే 2024 ఎన్నికల్లో టిడిపిని అఖండ మెజారిటీతో గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు దర్గా బాబు, సుబ్రహ్మణ్యం, వికలాంగుల జాతీయ నాయకులు మండవ వెంకట్రావు, టిడిపి నాయకులు మన్నవ రవిచంద్ర, బొట్లగుంట శ్రీహరి నాయుడు, మంచాల ప్రసాద్, షేక్.ఖాదర్ బాషా, తటవర్తి వాసు, దేవకుమార్, జ్యోతి బాబురావు, ఆవుల రామకృష్ణ, చవల రామకృష్ణ, గుత్తికొండ కిషోర్ బాబు, రఫీ, కోసూరు అశ్విని, తదితరులు పాల్గొన్నారు.










