
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : శ్రీ సత్య సాయి జిల్లాలో డీజిల్ మాఫియా జరుగుతోందని అందుకు సహకరిస్తున్న వాణిజ్య శాఖ పౌరసరఫరాల అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం స్థానిక నాయకులు కోరారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో తిప్పేనాయక్‌కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు పెద్దన్న, ఎస్‌హెచ్. బాషా, సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, సిఐటియు మండల కార్యదర్శి ఆదినారాయణ, వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా డీజిల్ బంక్‌ల యాజమాన్యాలు ఒక మాఫియాగా ఏర్పడ్డాయని విమర్శించారు. సుమారు రూ. 100 కోట్ల కుంభకోణం చేస్తున్నారని అన్నారు. డీజిల్ మాఫియాకు ప్రభుత్వ అధికారులు, ఆర్టీసీ, సిటిఒ, సివిల్ సప్లై అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు. ధర్మవరానికి సంబంధించిన మణికంఠ డీజిల్ బంకు ద్వారా రూ. 3.82 లక్షల లీటర్లు కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారని అయితే ఇందులో ఒరిజినల్ బిల్లులు 1.26 వేల లీటర్ల మాత్రమే అని అన్నారు. అదేవిధంగా పెనుగొండ సంబంధించి సాయి కిషన్ డీజిల్ బంకు వారు, హిందూపురానికి సంబంధించి పాండురంగ రవి ఎంటర్ప్రైజెస్ తదితరులు ఇలాంటి నకిలీ బిల్లులు సమర్పించి వందకోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి ధర్మవరం పట్టణ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ బంకులను పర్యవేక్షణ చేసి, ఎలాంటి స్కాములు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ డీజిల్ మాఫియా కు పాల్పడిన వారిపై విచారణ జరిపి దోషులను శిక్షించి, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
హిందూపురం : డిజిల్ మాపియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహశీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన చేసి తహశీల్దార్ హసీనా సుల్తానకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జెడ్పీ శ్రీనివాసులు, రాము, రాజప్ప, రమణ, బాబా, మధు, తంతాధర్ తదితరులు పాల్గొన్నారు.