
ప్రజాశక్తి -పెనుకొండ : సత్యసాయి జిల్లాలో హిందూపురం,ధర్మవరం పెనుకొండ కు సంబంధించిన పలువురు డీజిల్ బంకు యాజమాన్యాలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడానికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారుల అవినీతి నిగ్గు తేల్చాలని సిపిఎం మండల కార్యదర్శి రమష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్ కార్తీక్‌కు గురువారం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురానికి సంబంధించిన డీజిల్ బంకు పాండురంగ రవి ఎంటర్ప్రైజెస్ డీజిల్ బంకు ద్వారా దాదాపుగా 12.38 లక్షల లీటర్లు కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారని ఇందులో ఒరిజినల్ బిల్లులు 2, 12 లక్షలు లీటర్స్ మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలిన 10.26 లక్షలు లీటర్లకు నకిలీ బిల్లు సమర్పించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని విమర్శించారు. అదేవిధంగా సాయి హితేష్ ఎంటర్‌ప్రైజెస్ 5.32 లక్షల డీజిల్ కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారని ఇందులో ఒరిజినల్ బిల్లులు 1,10 లీటర్లు మాత్రమే అని మిగిలిన 4.26 లక్షలు లీటర్స్ నకిలీ బిల్లు సమర్పించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని విమర్శించారు. పెనుకొండకు సంబంధించిన శ్రీ సాయి కిసాన్ డీజిల్ బంక్ వారు 31.43 వేల లీటర్స్ కొనుగోలు చేసినట్లు బిల్లులు చూపించారన్నారు. ఇందులో ఒరిజినల్ పిల్లలు 2.56 వేల లీటర్స్ మాత్రమే అని మిగిలిన 28.27 లక్షల లీటర్ల డీజిల్ నకిలీ బిల్లులు సమర్పించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తమకు ఉన్న సమాచారం అని అన్నారు. ఈ డీజిల్ బంకుల యజమానుల ప్రభుత్వ అధికారులు సహకారంతో 52.95 లక్షల లీటర్లు కొనుగోలు చేసినట్లు చూపించి ఇందులో 7.4 లక్షల లీటర్లకు ఒరిజినల్ సమర్పించి 45.97 లక్షల లీటర్స్ నకిలీ బిల్లు సమర్పించి సుమారు వంద కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. ఈ అవినీతిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిప్పన్న, గంగాధర్, వెంకటరాముడు, మహబూబ్ బాషా, నాగప్ప, మూర్తి తదితరులు పాల్గొన్నారు.