Aug 04,2023 23:49

మాట్లాడుతూన్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, పక్కన పాశం రామారావు తదితరులు

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : రాష్ట్రంలో 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా దాదాపు 5 లక్షల మంది డీఎస్సీ కోసం నిరీక్షిస్తున్నారని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు చెప్పారు. వైసిపి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని, సత్వరమే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెదనందిపాడుకు శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. 10,200 మంది కాంట్రాక్టు ప్రతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులైజేషన్‌ చేస్తామని సిఎం హామీనిచ్చారన్నారు. అయితే నియమకాలను 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పని చేసి ఉండాలనే నిబంధన వల్ల 4 వేల మంది అవకాశాలు కోల్పోయారని, ఈ నిబంధనలను రద్దు చేయాలని కోరారు. 1998లో డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించి 4,072 మందికి పోస్టులు ఇచ్చారని, మిగిలిన 2 వేల మందికీ న్యాయం చేయాలని కోరారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ఇప్పటికే నల్లమడ రైతు సంఘం తోపాటు రైతు సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయని, ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చి అధికారిని కూడా నియమించిందని తెలిపారు. అయితే ప్రక్రియ ముందుకు సాగాలంటే భూ సేకరణకు అవసరమైన రూ.113 కోట్లు విడుదల చేయాలన్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ విస్తరణ కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న మహిళ రైతుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అమానుష చర్యన్నారు. గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులకు నిధులను వెంటనే మంజూరు చేయకుంటే జిల్లాస్థాయిలో పోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు డి.రమేష్‌బాబు, కె.నాగేశ్వరరావు, జె.రామారావు, ఎన్‌.ఆచార్యులు, కె.హరిబాబు పాల్గొన్నారు.