ప్రజాశక్తి-గుంటూరు : తమకు న్యాయం చేయాలని కోరుతూ డిఎస్‌సి 1998 అభ్యర్థులు బుధవారం గుంటూరు డిఇఒ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. జిల్లాలో విల్లింగ్ ఇచ్చిన అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇవ్వాలని కోరుతూ గేటు ఎదుట నిరసన తెలిపారు. జిల్లాలో 788 మంది అభ్యర్థులు విల్లింగ్ లెటర్లు ఇచ్చారు. అయితే బుధవారం 229 పోస్టులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో మిగిలిన 559 మందికి అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. అభ్యర్థులందరికీ ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కానీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం పోస్టులు ఇస్తున్నారని, అందువల్ల మిగిలిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ పాటించకపోవటం వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ కమ్ మెరిట్ విధానం పాటించాలని కోరారు. ఈ సందర్భంగా డిఇఒ శైలజ, డిప్యూటీ డిఇఒ సుధాకర్‌రెడ్డి అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు అభ్యర్థులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కాగా 1998 డిఎస్‌సి అభ్యర్థులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను డిఇఒ శైలజ, డిప్యూటీ డిఇఒ సుధాకర్‌రెడ్డి, ఉర్దూ డిఐ ఖాసిం, హెచ్‌ఎంలు పర్యవేక్షించారు.










