Oct 30,2023 22:20

సరైన వర్షాలులేక ఆశాజనకంగా లేని వరిపంట
తెల్ల కంకులు ఎక్కువగా వస్తున్న దుస్థితి
ఎకరాకు రూ.30 వేల వరకూ పెట్టుబడి
దిగుబడి తగ్గుదలతో పెట్టుబడి సొమ్మూ కష్టమే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

          ఖరీఫ్‌ దిగుబడులపై అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ఎకరాకు 30 బస్తాల దిగుబడి రావడమే గగనం అన్నట్లు రైతులు భావిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం సకాలంలో వర్షాలు పడకపోవడమేనని రైతులు చెబుతున్నారు. వర్షాలు లేకపోవడంతో తెల్ల కంక్కులు ఎక్కువగా వస్తున్నాయని, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టడంతో అన్నదాత లోలోన గుబులు చెందుతున్నారు. ఖరీఫ్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ ఏడాది సరైన వర్షాలు కురవని దుస్థితి నెలకొంది. వర్షాకాలం నాలుగు నెలల్లో ఒక్క జులై మినహా మిగిలిన మూడు నెలల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. మెట్ట ప్రాంతంలోని పలు మండలాల్లో వర్షాలు లేక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో వరి పొలాలు ఆశాజనకంగా తయారు కాలేదు. ప్రస్తుతం పొలాలన్నీ ఈనిక దశలో ఉన్నాయి. ప్రతి దుబ్బులోనూ ఒకటి, రెండు తెల్ల కంకులు వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈనిక పూర్తయ్యేసరికి తెల్లకంకుల శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఎకరాకు 40 బస్తాల వరకూ దిగుబడి రావాల్సి ఉండగా 30 బస్తాలు రావడమే గగనం అన్నట్లుగా ఉందని రైతుల అంచనా. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడి పెట్టామని, దిగుబడి తగ్గితే తీవ్ర నష్టాలు తప్పవని అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ఖరీఫ్‌ సాగు ఆది నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. సరైన వర్షాలు లేక సాగునీటి కోసం రైతులు నానాతంటాలు పడ్డారు. వర్షాలు కురవకపోవడంతో ఎరువులు, పురుగుమందులు అత్యధికంగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలుకల బెడదతో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అన్ని అడ్డంకులూ దాటుకుని ఈనిక దశలో తెల్లకంకులు వస్తుండటంతో రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కోతల సమయంలో వర్షాలు కురిసే ప్రమాదం ఉందని రైతులు భావిస్తున్నారు. అదే జరిగితే అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌ దిగుబడులు ఆశాజనకంగా వస్తేనే రైతులకు రబీలో కాస్తాకూస్తో ఖర్చులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖరీఫ్‌ దిగుబడులు తగ్గితే రబీలోనూ రైతులకు నష్టాలు తప్పవని చెప్పొచ్చు. మరో 20 రోజుల్లో ఖరీఫ్‌ మాసూళ్లు ముమ్మరంగా ప్రారంభం కానున్నాయి. దీంతో దిగుబడులు ఏ విధంగా వస్తాయోననే భయం అన్నదాతను వెంటాడుతోంది.
వర్షాల్లేక దెబ్బతిన్న పంటలు
ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో వరి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. మెట్టప్రాంతంలో వర్షాభావంతో సాగు చేసిన పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉంది. చింతలపూడి, చాట్రాయి వంటి మండలాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటలు సైతం దిగుబడి ఏ విధంగా వస్తాయోననే భయంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి నష్టపరిహారం అంచనాలు నమోదు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనమూ లేకపోవడంతో రైతులు గుబులు చెందుతున్నారు. బీమాతోపాటు, పంట నష్టపరిహారం ఇచ్చి రైతులను ప్రభుత్వం ఆదుకుంటేనే రైతులు కోలుకునే పరిస్థితి ఉంటుంది.