ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు, పల్నాడు జిల్లాల్లో 20 రోజులుగా వర్షాలు కురకపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగక కాల్వలకు తక్కువ స్థాయిలో నీరు విడుదల చేయడం వల్ల పైర్ల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇది రానున్న రెండు నెలల కాలంలో దిగుబడులపై తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కలిపి వరి 1.65 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంటున్న తరుణంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. డెల్టాలో రోజుకు ఆరువేల క్యూసెక్కులకు గాను 3 వేల వరకు విడుదల చేస్తున్నారు. తెనాలి, పెదకాకాని, చేబ్రోలు తదితర మండలాల్లో కాల్వలకు నీరందక డెల్టాలోనే వరిపైరు ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరి దిగుబడి కనీసం 30-40 బస్తాలు వస్తాయి. అయితే ఈసారి 20-25లోపు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి ఇంకా రెండునెలలు కొనసాగితే మాత్రం దిగుబడి ఇంకా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. వరికి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో కాల్వలకు నీటి విడుదల బుధవారం నిలిపివేశారు. తాగునీటి అవసరాల పేరుతో కేవలం ఐదు టీఎంసీలనే గత వారం రోజులుగా సరఫరా చేశారు.
రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 1.25 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు జరిగింది. మిర్చి పైరు ఎదుగుదల దశలో ఉంది. రెండు నెలల క్రితం సాగు చేసిన ప్రాంతాలలో పూత దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో వర్షాలు లేక, కాల్వలకునీరు రాకపోవడం వల్ల పైరు బెట్టకు వస్తున్నాయి. మిర్చికి కనిష్టంగా 10 క్వింటాళ్లు వస్తాయని ఆశలో రైతులు ఈ ఏడాది మిర్చి సాగు చేశారు. కానీ మిర్చి పంటకు మూడు తడుల్లో నీటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఒక్కతడి కూడా పూర్తి కాలేదు. అక్టోబరు, నవంబరు నెలల్లో తుపాన్లు వస్తే డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మూడు తడులు పెడితే కనీసం 10-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మిర్చికి ధర ఆశాజనకంగా ఉంటోంది. కనీసం రూ.15 వేలకు తగ్గడం లేదు. రైతులు ఎకరాకు రూ.లక్షకు పైగాపెట్టుబడి పెడుతున్నారు. చీడపీడల ప్రభావం లేకపోతే నాణ్యమైన మిర్చి వస్తుంది. కానీ ఈ ఏడాదిమిర్చి సాగు గాలిలో దీపంలా మారింది. ఖరీఫ్‌లో మూడునెలలు వేచిచూసి సెప్టెంబరులో వర్షాలు బాగాపడటంతో రైతులు అక్టోబరు, నవంబరులో తుపాన్లు వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని భావించి మిర్చి సాగుకు మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
పత్తి సాగు కూడా ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ఉంది. పల్నాడు జిల్లాలో 1.53లక్షల ఎకరాల్లో, గుంటూరు జిల్లాలో 40 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం దాదాపు లక్షన్నర ఎకరాల్లో పత్తి పైరు మొదటి తీతలకు సిద్ధంగా ఉంది. పూత, కాయ బాగానే ఉంది. అయితే కాల్వ చివరి భూములు, వర్షాలు చాలా తక్కువ కురిసిన ప్రాంతాల్లో పైరుబెట్టకు వచ్చింది. మొదటి తీతలో 3 నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రాబోయే పక్షం రోజుల్లో వర్షం కురవపోతే మెట్ట ప్రాంతంలో పత్తిపైరు బెట్టకు వచ్చి ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. పత్తి గతేడాది కనిష్టంగా 10 క్వింటాళ్ల దిగుబడి రావడం, ధర కూడా క్వింటాళ్ రూ.6-7 వేలకు కొనుగోలు చేయడం వల్ల రైతులు కొంత మేరకు నష్టాల నుంచి బయటపడ్డారు. ఈ ఏడాది వర్షాభావం వల్ల దిగుబడి, నాణ్యత తగ్గుతుందని చెబుతున్నారు. ప్రధాన పంటలైన వరి, మిర్చి, పత్తి పైర్ల పరిస్థితి ఇలా ఉంటే అపరాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 వేల ఎకరాల్లో సాగు అయిన కంది, 15 వేల ఎకరాల్లో సాగు అయిన మినుము పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు.