ప్రజాశక్తి - శ్రీకాకుళం: డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసుకునేందుకు తక్షణమే అవకాశం కల్పించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శాఖాధిపతులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కేటాయింపుపై బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021-22 డిగ్రీ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కోసం ప్రభుత్వ శాఖాధిపతులకు కేటాయించిన విధంగా విద్యార్థులను తీసుకోవాలని ఆదేశించారు. ఇది షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ అని, గతేడాదీ రెండు సార్లు విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు శాఖాధిపతులకు కేటాయించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం 6,352 మంది విద్యార్థులను 24 శాఖలకు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో 2,433 మంది సచివాలయాలకు, 2,206 మందికి విద్యాశాఖలో, 556 మందికి వైద్యారోగ్యశాఖకు అత్యధికంగా కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన శాఖలకు తక్కువగా ఉన్నారని, వీరందరికీ గతంలో మాదిరిగానే ప్రొసీడింగ్స్ ఇచ్చి, ఆయా అధికారులకు సమాచారాన్ని అందజేయాలన్నారు. విద్యార్థులు వెళ్లాల్సిన అధికారి పేరు, ఫోన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు. ఇంటర్న్‌షిప్ ఈనెల 18 నుంచి ప్రారంభం కావాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, సెట్‌శ్రీ సిఇఒ బి.వి ప్రసాదరావు, జిల్లా సరఫరాల అధికారి డి.వెంకటరమణ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










