Apr 06,2023 21:47

ప్రజాశక్తి - ఏలూరు
       ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వతమైన భవనాలు ఏర్పాటు చేయాలని అఖిల పక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. కాలేజీ విద్యార్థులు 'ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల సాధన సమితి'గా ఏర్పాటయ్యారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ఏలూరు మర్చంట్‌ ఛాంబర్‌లో అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ ఏలూరులో 2008లో ప్రారంభించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేకపోవడం సరికాదన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు మంజూరైన ఏడు కాలేజీలకు భవనాలు ఏర్పాటుకాగా జిల్లా కేంద్రం ఏలూరులో కాలేజీకి నేటికీ సక్రమమైన వసతులతో కూడిన భవనాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. వైసిపి నగర అధ్యక్షులు బొద్దాని శ్రీను మాట్లాడుతూ ఎంఎల్‌ఎ ఆళ్ల నానితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసి నేత యు.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నేత అర్‌.రామ్మోహనరావు, టిడిపి నేత చోడే వెంకటరత్నం మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి తోడ్పడతామమని, విద్యార్థులకు భవిష్యత్‌ కార్యాచరణపై సూచనలు, సలహాలు ఇచ్చారు. దానితోపాటుగా అఖిలపక్ష విద్యార్థి సంఘాలు పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, వైఎస్‌ఆర్‌ఎస్‌ఎఫ్‌, న్యాయవాద, దళిత సంఘాలు, హేలపూరి బాలోత్సవ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భావనాల సాధనకు వారి సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. ఈ సమావేశానికి కాలేజీ విద్యార్థి పి.దుర్గాప్రసాద్‌ అధ్యక్షత వహించారు.