ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం ఇన్‌ఛార్జీ ప్రిన్సిపల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా డిగ్రీ కళాశాల కోసం ఎదురుచూసిన విద్యార్థుల కల నెరవేరిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు కోర్సులకు అనుమతి వచ్చిందని, విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ భవనం లేనందువల్ల నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగా ప్రభుత్వ గర్ల్స్ కళాశాలలోనే డిగ్రీ కళాశాల కొనసాగింపు జరుగుతుందన్నారు. ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్ పద్ధతిలో అమ్మాయిలు, అబ్బాయిలకు తరగతుల నిర్వహణ ఉంటుందని తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను కేటాయింపులకు కూడా ప్రభుత్వ అనుమతి వచ్చిందన్నారు. ఇప్పటికే ఇన్‌ఛార్జీ ప్రిన్సిపల్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. త్వరలోనే శాశ్వత భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. కళాశాల మంజూరు కోసం పోరాడిన విద్యార్థి సంఘాల నాయకులకు అభినందనలు తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి










