ప్రజాశక్తి - వీరఘట్టం, గరుగుబిల్లి : గరుగుబిల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించాలని, పోస్టు మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని, వీరఘట్టంలో డిగ్రీ కళాశాలకు సొంత భవనం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించకపోవడం దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సైకిల్ యాత్ర కమిటీ విమర్శించింది. ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర నాలుగో రోజు గరుగుబిల్లి, వీరఘట్టం మండలాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి డి.పండు, పి.రాజశేఖర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేలా తమ విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసేలా అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న జగనన్న ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని వాపోయారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవలేక లేక చదువు మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఒకే భవనంలో రెండు కళాశాలలు నిర్వహించడం అన్యాయం, కావున ప్రభుత్వ వెంటనే స్పందించి మెరుగైన విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మండల కేంద్రంలో పోస్టుమెట్రిక్ హాస్టళ్లు, జూనియర్ కళాశాలకు నూతన భవనం ఏర్పాటుకై, డిగ్రీ కళాశాల సొంత భవనం నిర్మాణంకై ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ హాస్టళ్లకు బకాయిలుగా నిలిచిన మెస్ ( డైట్ ) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకువచ్చిన హనర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్నషిప్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఎన్‌ఇపి రద్దు చేయాలని, 117జిఒ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లల్లో పర్మినెంట్ వర్కర్లను, వార్డ్డెన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టల్‌కు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఎఎన్‌ఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. లేనిచో యాత్ర అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు కె.రాజు, హెచ్.సింహాచలం, బి.గంగారావు, కె.భాస్కరరావు. నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు










