ప్రజాశక్తి-గుంటూరు : దిగంబర కవిత్వ ఉద్యమానికి సంస్కరణ కవిత్వమే పైగంబర కవిత్వ ఉద్యమం అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రావి రంగారావు అన్నారు. బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒ సమావేశ మందిరంలో ఆదివానం సాహిత్య సభ నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త అబ్దుల్ రజా హుస్సేన్ రచించిన 'పైగంబర కవిత్వం - ఒక పరిశీలన' గ్రంథాన్ని రావి రంగారావు ఆవిష్కరించి, ప్రసంగించారు. దిగంబర కవిత్వం అత్యావేశంతో, అశ్లీలంతో పాఠకులకు ఇబ్బంది అనిపిస్తే స్థిరమైన ఆవేశంతో అశ్లీలం పరిహరించి ప్రజల్ని విప్లవ మార్గంలో నడిపించటానికి ఎగసిన ఉద్యమ కెరటం పైగంబర కవిత్వం అని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గ్రంథాన్ని సమీక్షిస్తూ ఎం.కె. సుగంబాబు సారధ్యంలో పైగంబర కవిత్వ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. సుగం బాబుతో పాటు దేవీప్రియ, ఓల్గా, కమలాకాంత్, కిరణ్‌బాబు తదితర కవులు పైగంబర కవులుగా ముందుకొచ్చి పైగంబర కవిత్వ సంకలనాలని తీసుకొచ్చారన్నారు. పైగంబర కవులు ప్రచురించిన 'యుగ సంగీతం', 'యుగ చైతన్యం' కవిత్వ సంకలనాలను గురించి రచయిత చక్కగా విశ్లేషించారన్నారు. ఐదుగురు కవుల కవిత్వాన్ని రజా హుస్సేన్ చక్కగా వివరించారని మెచ్చుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలీఘర్ ముస్లిమ్ విశ్వ విద్యాలయం విశ్రాంత ప్రాచార్యులు ప్రొఫెసర్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వ ఉద్యమం విప్లవ కవిత్వ ఉద్యమం లక్ష్యాలు ఒక్కటి కావడం విశేషమన్నారు. నయాగరా కవులు, రాత్రి కవులు, తిరగబడు కవుల కంటే స్థిరమైన కవిత్వ రూపాన్ని పైగంబర కవిత్వం సంతరించుకుందని చెప్పారు. గ్రంథ రచయిత అబ్దుల్ రజా హుస్సేన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వం కూడా సాహిత్య చరిత్రలో ఒక గొప్ప మలుపుగా భావించి ఈ రచన చేశానని చెప్పారు. అనంతరం ఈమాసం కవి సిరిపురపు అన్నపూర్ణను, పుస్తక రచయితను సాహితీవేత్తలు సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ పింగళి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.