ప్రజాశక్తి - హోళగుంద
టమోటా ధర దిగి రావడం లేదు. కూరగాయల ధరలు మండుతుండడంతో 'ఏం కొనలేం. తినలేం' అంటూ వినియోగదారులు వాపోతున్నారు. టమోటా ధరలు రూ.100 నుంచి రూ.130లకు పెరిగాయి. వివిధ కూరగాయల ధరలు కూడా రూ.50కి పైమాటే పలుకుతున్నాయి. ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయి. గత రెండేళ్లుగా టమోటా ధరలు రూ.70, 80 వరకు పెరిగాయి. ఏకంగా రూ.130లకు చేరడం ఇదే మొదటిసారి అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించిన రైతుల నుంచి మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు కొనుగోలు చేయడం వల్ల కూరగాయల ధరల అమాంతం పెరిగిపోతున్నట్లు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర కిలో టమోటా తీసుకెళ్తే రెండు పూటలు కూడా సరిపోవడం లేదని దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం వంటల్లో టమోటాను తగ్గించి చింతపండుతో సరిపెట్టుకుంటున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ శ్రేయస్సు అని గొప్పలు పాలకులు చెప్పుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నేరుగా రైతుల నుంచి టమోటాను కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరకు అందించడంతో పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల ప్రభుత్వ అమ్మకం కేంద్రాలను మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అమ్మకానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు










