Sep 20,2021 07:09

     'బియ్యం ఈ పూటకి సరిపోతాయి. నేను, శేఖర్‌ కొంచెం తగ్గించుకుని తింటే రాత్రికి పిల్లలిద్దరికీ అన్నం సరిపోతుంది. ఇడ్లీలు అమ్మే మామ్మగారు అరువు ఇస్తుంది. కనుక నాలుగు ఇడ్లీలు తెచ్చుకుంటే రాత్రి గడచిపోతుంది. కానీ... రేపటి నుంచి ఎలా..? శేఖర్‌కి ఇంకో వారం వరకూ కార్యక్రమాలు ఏమీ లేవు. అంటే అప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా వచ్చే మార్గం లేదు. మరి.. రేపటి నుంచి ఎలా..!' అనుకుంది లలిత. ఆలోచించిన కొద్దీ దిగులు మరింత పెద్దదై తన మెడకి ఉరితాడులా బిగుస్తున్నట్లు అనిపిస్తోంది. 'అసలు ఉరి వేసుకుంటేనే నయం. ఈ సమస్యలన్నిటి నుంచీ విముక్తి దొరుకుతుంది' అనుకుంది. వెంటనే 'ఇది సరికాదు. తను లేకపోతే శేఖర్‌ ఒక్కడే ఈ సంసారాన్ని ఈదలేడు. పిల్లలు తల్లిలేని దౌర్భాగ్యులవుతారు.. అలా అస్సలు జరగక్కూడదు' అనుకుని కన్నీటిని చీర కొంగుతో తుడుచుకుంది.
    లలిత బీఎస్‌సి, బిఈడి చదివింది. పోటీ పరీక్ష రెండుసార్లు రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో ఓ ప్రైవేటు స్కూల్లో గణిత ఉపాధ్యాయినిగా చేరింది. తండ్రి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. ఆయన మంచి స్థితిపరుడు. అల్లుడు కూడా గవర్నమెంటు ఉద్యోగస్తుడు మాత్రమే కాకుండా తన స్థాయికి తగిన ఆస్తి, సొంత ఇల్లు కలవాడై ఉండాలని చూశాడు. ఒక సంవత్సరం గడచినా ఆ మూడు అర్హతలూ ఉన్న వాడు దొరకలేదు. ఈ లోగా లలితకి శేఖర్‌ పరిచయం అయ్యాడు. తను పనిచేస్తున్న స్కూల్లోనే సోషల్‌ ఉపాధ్యాయుడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయాన్ని తండ్రితో చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎంతో క్రమశిక్షణతో పెంచిన లలిత ఇలా చెబుతుందని ఎప్పుడూ అనుకోలేదు. తన మనసుకి, భార్యకి సర్దిచెప్పి శేఖర్‌ వివరాలు సేకరించాడు. అతను ప్రతిభ కలవాడే. ప్రభుత్వ ఉద్యోగం సాధించగలడు. కానీ ఆస్తులు కాదుగదా సొంత ఇల్లు కూడా లేదు. వాళ్ల నాన్న గారు ఒక పద పురోహితుడు. అది కూడా ఏ కార్యక్రమాలూ సొంతంగా చేయించే వాక్కు లేక వేరొకరికి సహాయకుడిగా వెళుతూ ఉంటాడు. వాళ్ల అమ్మగారు వంట మనిషి. అంత బీద ఇంటికి తన కూతురిని కోడలిగా పంపలేనని అన్నాడు.
శేఖర్‌ వాళ్ల నాన్నగారు అతనిని చీవాట్లు పెట్టాడు. అంతటి ధనవంతుడు తన కూతుర్ని మనలాంటి వాళ్లకి ఎలా ఇస్తాడు. ఇవ్వనుగాక ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా వాళ్లతో తూగలేక మనం చాలా ఇబ్బందులు, అవమానాలు పడాల్సి వస్తుందని చెప్పాడు. పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకుని మనం మాత్రం ఏం సుఖపడతాం... వద్దులే అనుకున్నారు. అన్నీ మర్చిపోయి ఎవరి బతుకు వాళ్లు బతుకుదామని నిర్ణయించుకున్నారు. కానీ నెల రోజులు కూడా ఉండలేకపోయారు. ఇకపై అలా ఉండటం తమవల్ల కాదని అర్థం అయ్యింది. స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి ఇళ్లకీ వెళ్లారు. ఇద్దరూ తమ ఇళ్లలోకి రావద్దన్నారు. ఇకపై మీతో మాకు సంబంధం లేదని కచ్చితంగా చెప్పారు.
కొత్త జీవితం ప్రారంభం అయ్యింది. ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఈ మధ్యలో రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు జరిగాయి. విజయం ఇద్దరికీ తక్కువ మార్కులతో చేజారిపోయింది. ఇద్దరు మగ పిల్లలు పుట్టడం, పెద్దవాడిని స్కూల్లో చేర్చడం జరిగింది. అయినా తల్లిదండ్రులను కలవలేదు. వాళ్లు కూడా వీళ్లని పట్టించుకోలేదు. లలిత బాలింతగా ఉన్నప్పుడు తోటి టీచర్లు , స్నేహితులే సహకరించారు. ఇద్దరికీ కలిపి ఇరవై వేలు జీతం వస్తోంది. వేసవి సెలవుల్లో సగం జీతం మాత్రమే ఇస్తారు. తరువాత ఏడాది ఉద్యోగంలో ఉండాలంటే కోత తప్పదు. అద్దె ఇంట్లో సగటు జీవితం నడుస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా ప్రపంచం మీద కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడింది. దేశం మీద లాక్‌డౌన్‌ ఉక్కుపాదం మోపింది. వీళ్లు పనిచేస్తున్న స్కూలు మూతపడింది. ఏప్రిల్‌ నుంచి జీతాలు ఇవ్వలేదు. టీచర్లు అంతా కలిసి యాజమాన్యాన్ని అడిగితే స్కూలు రన్‌ అవ్వడం లేదు కదా మాకు ఫీజులు రానప్పుడు మీకెలా ఇస్తామన్నారు. వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఆ స్కూలు యాజమాన్యాన్ని కనీసం సగం జీతం అయినా ఇమ్మని అడిగారు. వాళ్లు ఒప్పుకోలేదు. కొందరు టీచర్లు ధర్నా చేద్దామన్నారు. కానీ అలా చేస్తే స్కూల్‌ తెరిచాక తమని మళ్లీ పనిలోకి తీసుకోరేమో అనే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. ధైర్యం, ఐకమత్యం లేనిచోట పోరాటం లేదు. పోరాటం లేని చోట మనుగడ లేదు. ఉండేది కేవలం యాంత్రికతే.
ఒక నెల గడిచింది. అద్దె కట్టడానికి కాదు కదా తినడానికీ ఏమీ లేని పరిస్థితి. ఖాతాలో సరుకులు ఇచ్చే కిరాణా కొట్టు ఆయన 'అమ్మా ! ఈ నెలకి ఎలాగో ఇవ్వగలను. కానీ వచ్చే నెల నుంచి పాత బాకీ కట్టకపోతే సరుకులు ఇవ్వలేను. నాకూ వ్యాపారం నడవాలి కదా' అన్నాడు. వారం రోజులు ఏం చెయ్యాలో తోచలేదు. ఎవరైనా ధనికులు, పెద్ద ఆఫీసర్లు వాళ్ల పిల్లలకు ఇంటి దగ్గరే ట్యూషన్లు చెప్పించుకుంటారేమో అని ప్రయత్నించింది. ఈ కోవిడ్‌ రోజుల్లో ఇంటి దగ్గర మాత్రం ఎందుకమ్మా? ఇదేదో పూర్తిగా తగ్గాక, ఆ వ్యాక్సిన్‌ ఏదో వచ్చాక చూద్దాంలే అన్నారు.
ఓ సాయంత్రం తనలాగే ఇబ్బందులు పడుతున్న మరో టీచర్‌ రమ వచ్చింది. ఆమె లలితకి కొలీగ్‌ మాత్రమే కాదు. మంచి స్నేహితురాలు. మాటల మధ్యలో 'లలితా.. నాదో చిన్నమాట. మీ నాన్న గారి దగ్గరకి వెళ్లు. ఈ పరిస్థితుల్లో తప్పక సాయం చేస్తారు. ముందు కోపంగా మాట్లాడినా లోపల నీ మీద ప్రేమ తప్పకుండా ఉంటుంది' అంది.
'నో... వెళ్లను. అలా వెళ్లే దాన్నే అయితే పిల్లల కాన్పులప్పుడే వెళ్లేదాన్ని. ఇన్నేళ్లు నేనక్కర్లేదు అనుకున్న వాళ్ల దగ్గరికి ఇప్పుడు మాత్రం ఎలా వెళ్లను' అంది. 'పోనీ అప్పుగా అయినా అడుగు. మన స్కూల్‌ తెరిచాక మెల్లగా తీర్చవచ్చు' అంది రమ. 'నాన్నగారు ఈ వీధిలోంచే బైక్‌మీద వెళుతూ ఉంటారు. కనీసం మనవల్ని చూద్దామని కూడా ఏనాడూ అనిపించలేదు' అంటుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. రమ వెళ్లిపోయింది. తనలో తను 'అయినా వాళ్ల ఆశలను వమ్ము చేస్తూ నా నిర్ణయం నేను తీసుకోవటం ఘోరమైన తప్పు. దానికి ఆయన విధించిన శిక్షను అనుభవించడంలో అయినా నిజాయితీ ఉండాలి కదా' అనుకుంది.
శేఖర్‌కి పని దొరికింది. పురోహిత సంఘం నాయకుడు అవధానిగారు ఇప్పించారు. తద్దినాలకి భోక్తగా వెళ్లడం, ఆ రోజు భోజనం దొరకడమే కాదు. మూడు వందలు దక్షిణగా వస్తాయి. అంటే రెండు రోజులు కుటుంబం అంతటికీ ఆకలి తీరుతుంది. ముందు కొంచెం సంశయించాడు. స్కూల్లో పిల్లల ఇళ్లకిగానీ, కొలీగ్స్‌ ఇళ్లకిగానీ వెళ్లవలసి వస్తే ఇబ్బందేమో అనుకున్నాడు. కానీ ఆకలి ముందు అవేవీ పెద్దగా అనిపించలేదు. నాలుగు రోజుల తరువాత లలిత కిరాణా షాపు యజమానిని పనేదైనా ఉంటే చేస్తానని అడిగింది. ఆయన వెంటనే 'ఉన్న వాళ్లకే జీతాలివ్వడం కష్టంగా ఉంది' అన్నాడు. కానీ తరువాత రోజు తనే కబురు పంపాడు. మా రైస్‌ మిల్లులో అకౌంట్స్‌ రాయాలి.. చేస్తారా? అని అడిగాడు. తను లెక్కల టీచరే కానీ వ్యాపారపు లెక్కలు రావనీ, బీకాం చదివిన వాళ్లు మాత్రమే అవి రాయగలరని చెప్పింది. దానికి ఆయన 'అదేం బ్రహ్మవిద్య కాదమ్మా! ఇప్పుడు రాస్తున్న పెద్దాయన పదో తరగతి వరకే చదివారు. అయినా ఆయన రాసిన అకౌంట్స్‌లో సిఎ ఆడిటర్లు కూడా ఇప్పటివరకూ ఇరవై సంవత్సరాల్లో ఒక్క తప్పూ పట్టుకోలేదు. వయసు అయిపోవటం వల్ల మానేస్తున్నారు. మీకు ఆయన దగ్గరుండి ఒక నెలరోజులు నేర్పిస్తారు' అని చెప్పాడు. నెలకు పదివేలు ఇస్తానన్నాడు. భయం పోయి కొంచెం ధైర్యం వచ్చింది. అంతకంటే అవసరం తెగింపునిచ్చింది. శేఖర్‌ కూడా బాగా ప్రోత్సహించాడు.
శేఖర్‌కి వారంలో మూడు రోజులే పని దొరుకుతోంది. నాలుగు రోజులు ఉండటం లేదు. కోవిడ్‌ భయంతో చాలామంది శాస్రోక్తంగా చేయించుకోడానికి భయపడి, ఒక్కరినే పిలుస్తున్నారు. వారికీ భోజనం పెట్టకుండా స్వయంపాక దానం (భోజనానికి కావాల్సిన సరుకులు)తో సరిపెడుతున్నారు. అందువల్ల కేవలం భోక్తలుగా వెళ్లే వాళ్లకి గిరాకి లేకుండా పోయింది. ఎందుకంటే సాధారణంగా ఆ దానం మంత్రం చెప్పగలిగిన వాళ్లకి మాత్రమే ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. కానీ శేఖర్‌కి మధ్యలో అవధాని ఫోన్‌ చేసి ఎవరో ఒకాయన భోక్తగా వస్తానని ఇప్పుడు రాలేదనీ, నువ్వు వెంటనే వెళ్లమని పురమాయిస్తున్నాడు.
ఓ సాయంత్రం శేఖర్‌ తోటి ఉపాధ్యాయులు రవి, మధుసూదన్‌ కలిశారు. ఎలా ఉంది మాస్టారూ అనుకున్నారు. రవి కుటుంబాన్ని వాళ్ల మామగారు చూస్తున్నారు. తనే మొహం చెల్లక మధ్యమధ్యలో ఇక్కడికి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్తున్నాడు. మధుసూదన్‌ వాళ్ల నాన్న నెలకి పదివేలు చొప్పున జీతంలాగా పంపుతున్నారు. దీంతో ఇద్దరికీ ఇబ్బంది లేదు. శేఖర్‌ తను చేస్తున్న పని గురించి చెప్పడానికి సిగ్గుపడ్డాడు. తను హోం ట్యూషన్‌ చెబుతున్నానని చెప్పాడు. తమకూ అలాంటివి చెప్పమని ఇద్దరూ అన్నారు. ఇంటికి వస్తుంటే శేఖర్‌కి అనిపించింది నాన్నగారి పరిస్థితి అంతంత మాత్రం, ఇంకా తనకి ఏమి ఇవ్వగలరు. పోనీ అడుగుదామంటే... ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా వెళ్లని వాడిని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్లేది. మామగారు సమర్ధుడు. కానీ లలిత తనకంటే అభిమానవంతురాలు. ఎంత మాత్రం జరగదు కనీసం వాళ్ల ఇంటికి వెళ్లదు. అప్పుడు మొదటిసారిగా అనిపించింది. 'పెళ్లి వందేళ్ల ప్రయాణానికి వేసే మొదటి అడుగు. రెండు కుటుంబాలూ కలిసి భవిష్యత్తుకి ఇచ్చుకునే భరోసా, కేవలం ఇద్దరం ఉంటే చాలు. ఇంకెవరూ అవసరంలేదు..అనుకోవటం ఎంత అవివేకం. ప్రేమను గెలిపించుకోవాలనే తపనలో ఇవేమీ గుర్తుకు రావు. గుర్తుకొచ్చినా లెక్క చేయము' అనిపించింది.

                                                                             ***

లలిత అకౌంట్స్‌ శ్రద్ధగా నేర్చుకుంది. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేస్తోంది. ఇంట్లో మళ్ళీ బియ్యంలేని పరిస్థితి, మొహమాట పడుతూ తన యజమానిని అడ్వాన్సు ఇమ్మనీ, దాన్ని జీతంలో తగ్గించుకోమని అడిగింది. 'ఇప్పుడే అడిగితే ఎలాగమ్మా? మాకు రావాల్సింది ఎప్పుడో ఇస్తారు. మేము మాత్రం ముందే ఇచ్చేయాలా..?' అని, మళ్లీ వెంటనే 'సరే ఏది తప్పుతుంది... ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా' అంటూ నాలుగువేలు ఇచ్చాడు. నవంబర్‌ నెల బాగానే గడిచింది. ఎంత అలసిపోయినా ప్రతిరోజు కనీసం మూడు గంటలు పరీక్షకు ప్రిపేర్‌ అవుతోంది. శేఖర్‌ కూడా చదవటం మొదలు పెట్టాడు. ఓరోజు రవి, మధుసూదన్‌ వచ్చి శేఖర్‌ చదువుకోవటం చూశారు. ఇంకా ప్రకటనే రాని పరీక్షకి ఇప్పటినుంచీ చదవటం శుద్ద వేస్ట్‌, అయినా నీకు కావాల్సింది మాలాగా ఉద్యోగం కాదు... స్టేట్‌ ర్యాంకు... చదువు...మాకు పరీక్షలో చెబుదువులే అంటూ ఎగతాళి చేశారు. శేఖర్‌ జవాబు చెప్పకుండా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

                                                                             ***

ఒక్కోసారి... తమ మధ్య దూరం ఎక్కువైతే మనుషులు తమని లెక్కచేయరు...అనుకుంటాయేమో.. కష్టాలు వెంటవెంటనే వచ్చేస్తాయి. పెద్దబాబు రోడ్డుమీద తోటి పిల్లలతో ఆడుకుంటుండగా కోవిడ్‌ రోగుల్ని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ గుద్ది కాలు విరిగింది. డాక్టర్లు ఆపరేషన్‌ చేయాలి. ముప్పయి వేలు అవుతుందని చెప్పారు 'ఇక తప్పదు.. నాన్న గారి దగ్గరకు వెళ్లాల్సిందే' అనుకుంది లలిత. కానీ ఇంతలో డాక్టర్‌ పిలిచి 'అమ్మా ! మీరు టీచర్స్‌ కదా, అందుకే లయన్స్‌ క్లబ్‌ వాళ్లని అడిగాను. వాళ్లు పాతిక వేలు స్పాన్సర్‌ చేస్తానన్నారు. మిగతా ఐదువేలు చూసుకోండి' అన్నారు. లలిత అక్కడ పనిచేసే హెడ్‌ నర్స్‌కి బాగా తెలుసు. వాళ్ల పిల్లలు తన విద్యార్థులే, అందుకే ఆమె డాక్టర్‌తో తన పరిస్థితి చెప్పిందేమో అనుకుంది. మిగిలిన ఐదువేలూ షాపు యజమాని దగ్గర అడ్వాన్సుగా తీసుకుంది. అప్పుడు కూడా ఎక్కువ భాగం ఇప్పుడే తీసేసుకుంటున్నాను..రేపటి నెల గడిచేదిలా ... అనుకుంది. కానీ ముందు ఈ ఆపద నుంచి గట్టెక్కాలి కదా అని సర్ది చెప్పుకుంది.
సంక్రాంతి పండుగ వచ్చింది. ఈసారి పిల్లలకి మాత్రమే బట్టలు కొంది. అదీ ఒక్కొక్క జత. ప్రతి సంవత్సరం ఊళ్లో జరిగే తీర్ధానికి ఐదు రోజులూ పిల్లలను తీసుకేళ్లేవారు. ఈసారి ఏవో వంకలు చెప్పి ఒక్కరోజు మాత్రమే తీసుకెళ్లారు. రేపటి నుంచి ఎలా? అన్న ప్రశ్న మళ్లీ రాకుండా చూసుకోవాలని. జనవరి ఆఖరి వారంలో స్కూల్‌ తెరిచారు. లలితకి అవకాశం ఇచ్చారు. దీంతో శేఖర్‌ అకౌంట్స్‌ నేర్చుకుని లలిత పని తాను చేస్తానని యజమానిని అడిగితే సరే అన్నాడు. కష్టకాలంలో తమకి పనిచ్చి ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఒకసారి ఇద్దరిని రమ్మని చెప్పాడు. దీంతో రాత్రంతా ఎందుకు మళ్లీ రమ్మన్నాడా అనుకుని ఇద్దరూ మధనపడ్డారు. సరుకులు అరువు ఇచ్చిన డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తాడేమో అనుకున్నారు. ఉదయమే వెళ్లారు. ఆయన 'మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు అదిగో... ఆ హాల్లో ఉన్న వారికి వెళ్లి చెప్పండి. ఎందుకంటే మీకు నేను ఇచ్చిన ప్రతి రూపాయి ఆయన ఇచ్చిందే' అంటూ చూపించాడు. లోపల ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో ఒక్క క్షణం అలా నిలబడిపోయారు. లలిత ఒక్క పరుగున వెళ్లి 'నాన్న గారూ... అంటూ ఆయనను చుట్టేసింది. పాదాలకు నమస్కారం చేస్తూ రెండు కన్నీటి బొట్లతో పూజించింది. శేఖర్‌ కూడా పాదాభివందనం చేశాడు. అదే సమయంలో అవధాని కూడా అక్కడికి వచ్చారు. శేఖర్‌కి వరుసగా భోక్త అవకాశం లేనప్పుడు ఒక్కోసారి అనుకోకుండా ఎవరో మానేశారు... వెళ్లమని చెప్పిన విషయం గుర్తుచేశారు. అప్పుడు అలా మానేసింది. శేఖరం నాన్న గారేనని, ఆయన పస్తులు ఉండి శేఖర్‌కి అవకాశం కల్పించారని చెప్పారు. శేఖర్‌తోపాటు లలిత నాన్నగారి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. 'పదండి వెంటనే వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి' అన్నారు. బాబుకి ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ నుంచి కూడా ఫోన్‌ వచ్చింది. మరోసారి ఆశ్చర్యంగా తండ్రికేసి చూసింది లలిత. కన్నీటి తెరల వెనుక ఆయన దుస్తులే స్వచ్ఛమైన కమలాలుగా కనిపించాయి. ఆయన మనసులాగా, బయటకు వస్తుండగా రవి వాళ్లని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి మరో విషయం చెప్పాడు. శేఖర్‌ అమ్మగారికి కరోనా పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని, ఆమె శేఖర్‌ని చూడాలని ఆరాటపడుతున్నారని చెప్పాడు. కానీ వాళ్ల నాన్నగారు మాత్రం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు.. కనుక ఒక నెలరోజుల వరకూ రావద్దని చెప్పారని, తర్వాత మాత్రం తప్పకుండా రమ్మన్నారని చెప్పాడు. ఎనిమిది సంవత్సరాల్లో మొదటి సారిగా ఏడ్చాడు శేఖర్‌.
 

బొల్లాప్రగడ వెంకట పద్మరాజు
98498 99676