'దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది' అన్న ప్రముఖ విద్యావేత్త డిఎస్ కొఠారి మాటలు రేపటి పౌరులను తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల గురుతర బాధ్యతను తెలియజేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యత కలిగినట్టి ఉపాధ్యాయ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా అట్టిపెట్టి ఉంచడం దేనికి సంకేతం? అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, నాడు-నేడు వంటి పథకాల పేరుతో స్కూలుకెళ్లే పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సాయం, విద్యార్థులకు యూనిఫామ్, బూట్లు , పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం మంచిదే. పాఠశాలలకు మౌలిక వసతులు దీనివల్ల కొంతవరకు మెరుగుపడ్డాయి. పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరచడంపై చూపిన శ్రద్ధ తరగతి గదిలో ఉపాధ్యాయుల నియామకం దగ్గరకొచ్చేసరికి లేదు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళతామని చెబుతున్న ప్రభుత్వం అందుకు కీలకమైన ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం లేదా? విద్యా వ్యవస్థలో ప్రాథమిక విద్యకు ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వానికి తెలియనిదేమీ కాదు. ప్రాథమిక దశలో నాణ్యమైన విద్యను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే అది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో పిల్లల చదువులు చాలా వరకు దెబ్బతిన్నాయి. చాలా మంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు. గత ఒక్క సంవత్సరంలోనే 3లక్షల మంది దాకా పిల్లలు ప్రభుత్వ బడుల్లో అదనంగా వచ్చి చేరారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టుల సంఖ్య పెంచాల్సింది పోయి, విద్యార్థి - ఉపాధ్యాయ నిష్పత్తిలో మార్పులు తీసుకొచ్చి ఉన్న పోస్టులకే ఎసరు పెడుతున్నారు. గతంలో ఎన్‌రోల్‌మెంట్ తగ్గిందన్న పేరుతో పోస్టులను కుదించడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన విద్యాశాఖ అధికారుల, ఇప్పుడు పెరిగిన ఎన్‌రోల్‌మెంట్‌కు అనుగుణంగా పోస్టులను పెంచడానికి వెనుకాడుతున్నారు.
రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులన్నీ కలిపి 16వేలకు పైగా ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతోంది. వాస్తవంగా ఈ ఖాళీల సంఖ్య పాతికవేల పై మాటే. ప్రతియేటా పదవీ విరమణ చేసే వారి స్థానాలు కలిపితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నాయి. డిఎస్సీ ఇదిగో, అదిగో అంటూ కాలయాపనే తప్ప, కార్యాచరణ ఉండడం లేదు. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా నియామక ఉత్తర్వులు అభ్యర్థుల చేతికి రావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతున్నాయి.1998 డియస్సీలో అర్హులైన కొందరికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదంటే ఈ నియామక ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదీ అర్థమవుతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే టీచర్ పోస్టులను భర్తీ చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల ముందు ఆర్భాటంగా వాగ్దానం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మార్చింది. మరో మూడు మాసాల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అప్పటికల్లా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలంటే డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసి ఉండాల్సింది.కానీ, ఇంతవరకు ఆ ఛాయలే ఎక్కడా కనిపించడం లేదు. డియస్సీ ఎప్పుడు నిర్వహించేది ఇప్పటికీ ఇదమిత్థంగా ప్రభుత్వం చెప్పడం లేదు. డిఎస్సీకి ముందు నిర్వహించే టెట్ కు సంబంధించి మార్గదర్శకాలు విడుదలజేసి అదే గొప్ప అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. టెట్, ఆ తరువాత డిఎస్సీ ఈ తతంగమంతా పూర్తవడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేము. ఈ పరిస్థితిని చక్కదిద్దకుండా, అవసరమైన టీచర్ పోస్టుల భర్తీ చేయకుండా స్కూళ్లలో మెరుగైన ప్రమాణాలను ఎలా సాధిస్తారో ఏలినవారికే ఎరుక. ఇది పేద, బడుగువర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను నిరాకరించడం కాదా? ఇప్పటికైనా ప్రభుత్వం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలజేయాలి.సంక్షేమ పథకాలే ఎన్నికల మ్యానిఫెస్టో సర్వస్వం అన్న ధోరణిని ప్రభుత్వం విడనాడాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధిని ప్రదర్శించాలి.










