Feb 16,2023 00:12

ఎస్‌పి కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి డిఎస్‌పి సునీల్‌పై డిఐజి, లేదా సిఐడితో విచారణ చేపట్టాలని కోరుతూ స్థానిక ఎస్పీ కార్యాలయం ముందు బుధవారం టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎస్పీ గౌతమి శాలికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీలా మాట్లాడుతూ పోలీసులు గంజాయి రవాణా వాహనాలకు దొంగ నెంబరు ప్లేట్‌ మారిస్తే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో డిఎస్‌పి సునీల్‌ అవినీతిపై ఎస్పీకి నివేదించినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. గంజాయి అక్రమ రవాణాలో సీజ్‌ చేసిన వాహనాల్లో పోలీసులే తిరుగుతుంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారన్నారు. ఇలాంటి ఘటనల వల్ల పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుందని తెలిపారు. తక్షణమే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట్ని బాలాజీ, మాదంశెట్టి నీలబాబు, మల్ల సురేంద్ర, కాయల మురళి, సబ్బవరపు గణేష్‌, కొణతాల శ్రీనివాసరావు, తలారి కాశీనాయుడు, సిదిరెడ్డి సూర్య నారాయణ, ఎంఎస్‌ఎన్‌, అక్కిరెడ్డి రమణబాబు, ఆనాల తాతయ్య నాయుడు, కరణం రమణ, మాజీ సర్పంచ్‌ ద్వారపురెడ్డి సత్తిబాబు పాల్గొన్నారు.