Aug 06,2023 23:06

చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న వైసిపి నాయకులు

* ఎస్‌ఎఫ్‌ఐ శాంతియుత ర్యాలీ అడ్డగింత
* వైసిపి ర్యాలీకి మాత్రం అనుమతి
* పోలీస్‌స్టేషన్‌ వద్దే చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం
* బాలచంద్రారెడ్డి తీరుపై విమర్శల వెల్లువ
ప్రజాశక్తి - టెక్కలి రూరల్‌: 
మణిపూర్‌లో మారణకాండను ఆపాలని, ప్రజలు, మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు శనివారం శాంతియుతంగా నిర్వహించిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పుంగనూరు ఘటనపై వైసిపి నాయకులు ఆదివారం నిర్వహించిన ర్యాలీకి మాత్రం ఏ అడ్డంకులూ చెప్పలేదు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పినా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.రాజును పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకువెళ్లారు. డిఎస్‌పి బాలచంద్రారెడ్డి ఆయనపై చేయి కూడా చేసుకున్నారు. అధికార పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించి, టెక్కలి పోలీస్‌స్టేషన్‌ వద్దే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్ధం చేసినా మిన్నకున్నారు. దీంతో డిఎస్‌పి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి ఒకలా... ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలపై మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శాంతియుతంగా తమ భావాలను వ్యక్తం చేసుకునే హక్కు, నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ, శాంతియుతంగా చేపట్టే నిరసనలు, ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం పరిపాటిగా మారింది. అదే అధికార పార్టీ విషయానికి వచ్చేసరికి మాత్రం పోలీసులకు ప్రజాస్వామ్యం గుర్తొస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.