Aug 23,2023 17:58

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్‌
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
డిఎన్‌ఆర్‌ కాలేజీ ప్రయివేటీకరణ మానుకోవాలని, లేని పక్షంలో పోరాడి కళాశాలను కాపాడుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ అన్నారు. స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసన్నకుమార్‌ మాట్లాడారు. స్వాతంత్ర పోరాట వీరులు, మేధావులు 1945 జులై 4వ తేదీన ఈ కాలేజీని ఏర్పాటు చేశారని తెలిపారు. 71 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలేజీ ఎన్నో వేల మందికి విద్యనందించిందని, నేడు ఈ కాలేజీనీ యాజమాన్యం ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందని తెలిపారు. దాతల సహకారంతో సుమారు రూ.2500 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు ప్రయివేటుపరం అయితే ఆయా ఆస్తులు కొందరు వ్యక్తుల సొంతమవుతాయని తెలిపారు. యాజమాన్యానికి ఎడిట్‌లో నడపడం చేతకాకపోతే ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ భీమవరం అంటే ప్రజలకు గుర్తొచ్చేది డిఎన్‌ఆర్‌ కాలేజీ అని తెలిపారు. ఆ కాలేజీని కాపాడుకోవడం కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ పోరాటానికి భీమవరం ప్రజలు, మేధావులు, పూర్వ విద్యార్థులు మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు టి.ప్రసాద్‌, పట్టణ నాయకులు పి.శ్రీకాంత్‌, జి.శ్రీనివాస్‌, ఎస్‌.శాంతి, షైక్‌.సాయిలాల్‌, ఎస్‌.లక్ష్మణ్‌ పాల్గొన్నారు.