
కడప ప్రతినిధి డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో ఇష్టారాజ్యం నడుస్తోంది. 2022 జులైలో డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జిఒ ఉల్లంఘనకు గురైంది. తాజాగా డిఎంహెచ్‌ఒ కార్యాలయం వర్క్ అలాట్‌మెంట్ ముసుగులో 16 మందిని నియమించింది. వీరిలో ముగ్గురు నుంచి నలుగురు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు డిప్యూటేషన్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై విధులు నిర్వహించరాదనే ఉద్దేశంతో బాధ్య డిఎంహెచ్‌ఒల నుంచి సర్టిఫై చేయించుకుంది. సర్టిఫై తంతు ముగిసిన వెంటనే జిల్లాలోని 16 మంది ఉద్యోగులను వర్క్ అలాట్‌మెంట్ కింద నియమించారు. వీరిలో బద్వేల్, కొండాపురం, పెండ్లిమర్రి తదితర ప్రాంతాల నుంచి సుమారు నలుగురు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను డిఎంహెచ్‌ఒ కార్యాలయానికి రప్పించారు. వీరిలో గతంలో డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో పని చేసిన ఓ సీనియర్ అసిస్టెంట్ కొండాపురం పిహెచ్‌సికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. సదరు సీనియర్ అసిస్టెంట్ తరుచూ విధులు గైర్హాజరు కావడంతో ఎఫ్‌ఆర్‌ఎస్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఇటువంటి సీనియర్ అసిస్టెంట్‌కు జిల్లా ఎఫ్‌ఆర్‌ఎస్ బాధ్యతలు అప్పగించడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీనిపై డిఎంహెచ్‌ఒ నాగరాజును సంప్రదించగా స్టాఫ్‌నర్స్ రిక్రూట్‌మెంట్ నిమిత్తం నియమించుకున్నామని చెప్పడంలోని హేతుబద్దత ప్రశ్నార్థకంగా మారింది. వర్క్‌అలాట్‌మెంట్ చేసిన జాబితాలోని పేర్లలో నలు గురికి అలాట్‌మెంట్ చేసిన బాధ్యతలకు, స్టాఫ్‌నర్స్ రిక్రూట్‌మెంట్ వ్యవహారాలకు సంబంధం లేకుండా ఉండడం గమనార్హం. కలెక్టర్ జోక్యం చేసుకుని వర్క్ అలాట్‌మెంట్ పేరుతో డిప్యూటేషన్ల జివోను బేఖాతర్ చేయడాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.