Apr 18,2023 00:34

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

ప్రజాశక్తి - కాకినాడ
ప్రస్తుతం నిర్మాణ పనులకు వాతావరణం అనుకూలంగా ఉన్నందున జిల్లాలో జిల్లా ఖనిజ ఫౌండేషన్‌ కింద మంజూరైన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో కలెక్టర్‌ కృతికా శుక్లా అధ్యక్షతన డిఎంఎఫ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ డీడీ ఇ.నరసింహారెడ్డితో కలిసి డిఎంఎఫ్‌కు సమకూరిన మొత్తం, వివిధ పనులకు చేసిన ఖర్చు, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో పురోగతి, కొత్త పనుల ప్రతిపాదనలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృతిక మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో తొమ్మిది మండలాల పరిధిలో మైనింగ్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఈ కార్యకలాపాలతో ప్రత్యక్షంగా (10 కి.మీ. పరిధి), పరోక్షంగా (10-25 కి.మీ. పరిధి) ప్రభావితమవుతున్న గ్రామాలు, ఆవాసాల్లో డిఎంఎఫ్‌ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కాకినాడ జిల్లాలో దాదాపు రూ.14 కోట్లతో చేపట్టిన 55 పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు గ్రామీణ నీటి సరఫరా, సర్వ శిక్షా అభియాన్‌, రహదారులు, భవనాలు శాఖ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, ఐసిడిఎస్‌ తదితర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా జరిగిన సమా వేశంలో గండేపల్లి మండలం, సింగరాంపాలెం ఎస్‌సి కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పనబీ కిర్లంపూడి, ప్రత్తిపాడు, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు, శంఖవరం మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్‌, బిటి రోడ్లు తదితరాలకు సంబంధించి మొత్తం రూ. 2.62 కోట్లతో 20 పనులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. సమావేశంలో జడ్‌పి సిఇఒ ఎన్‌వివి సత్యనారాయణ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ హరిప్రసాద్‌ బాబు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసురావు, పశు సంవర్ధక శాఖ జెడి డాక్టర్‌ సూర్యప్రకాష్‌, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఇ ఎం.శ్రీనివాస్‌ హాజరయ్యారు.
తాగునీటి పథకాల క్లీనింగ్‌కు స్పెషల్‌ డ్రైవ్‌
కాకినాడ జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పిడబ్ల్యూఎస్‌, సిపిడబ్ల్యూఎస్‌ తాగునీటి పథకాలు అన్నిటినీ 18వ తేదీ మంగళవారం నాటికి నూటికి నూరు శాతం శుభ్రం చేసే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిచాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సోమవారం పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సోమవారంత జిల్లాలోని అన్ని తాగునీటి పధకాలను శుభ్రపరిచే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌.విక్టర్‌ పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ రాజ్‌ విస్తరణ అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇఒపిఆర్‌డిలు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు ఈ క్లీనింగ్‌ ప్రక్రియను స్వయంగా సందర్శించి, సంబంధించిన ఫోటోలను డిపిఒ కార్యాలయ మెయిల్‌ అడ్రస్‌ వస్త్రసజూశీసససఏస్త్రఎaఱశ్రీ.షశీఎకు పంపాలని ఆయన ఆదేశించారు. అలాగే మంగళవారం క్లీనింగ్‌ డ్రైవ్‌నిర్వహించి దానిపై జిల్లా కలెక్టర్‌ కు నివేదిక సమర్పించేందుకు, డిపిఒ యూనిట్‌ గ్రూప్‌లో తెలియజేసిన ప్రొఫార్మాలో మండలాల వారీగా క్రోఢకీరించిన సమాచారాన్ని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి సమర్పించాలని కాకినాడ, పెద్దాపురం డివిజనల్‌ పంచాయతీ అధికారులను ఆదేశించారు.