ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం సోమవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పోక్సో కోర్టు, జిల్లా న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పుగా ఏర్పడిందని, మనిషి జీవితం ప్లాస్టిక్‌తో ముడిపడి, చిన్న కవర్ నుంచి భారీ ఉపకరణాల వరకూ ప్లాస్టిక్ వాడుతున్నారన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిలువరించిన నాడే మానవ జీవితం ఆనందవంతంగా కొనసాగుతుందని అన్నారు. మొక్కలు నాటటం ద్వారా కొంత మేర పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.అనిత మాట్లాడుతూ చెట్లు, అడవులు నరికి ధ్వంసం చేయటం వల్ల, వాయుకాలుష్యం వల్ల, రసాయనాల వాడకం పెరగటం వల్ల ప్రతి ఇంట్లో ఏసీలు వాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చెట్లను కాపాడుకుంటే వేడి వాతావరణం తగ్గుతుందని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు సీతా రామకృష్ణారావు, అనిత మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిఎల్‌ఎస్‌ఎ డిఫెన్స్ కౌన్సిల్ కె.జీవరత్నం, డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిల్ ఇల్లా మధుబాబు, ప్యానల్ అడ్వకేట్లు సుబ్బయ్య, నవీన్, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.










