ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ : జిల్లా సమీక్షా మండలి సమావేశంలో చర్చించిన ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజిని కోరారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం మంత్రి విడదల రజిని అధ్యక్షతన బుధవారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా గత డిఆర్‌సి లో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు. తదుపరి జివిఎంసికి చెందిన అభివృద్ధి పనులు, విఎంఆర్‌డిఎ, జగనన్న హౌసింగ్, గృహ నిర్మాణ శాఖ, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, నాడు- నేడు, ప్రాధాన్యత భవనాలు, ఆర్‌బికెలు, వైఎస్‌ఆర్ ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పోలీస్ పెట్రోలింగ్ పెంచి యువత పెడదారి పట్టకుండా నిరోధించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీధి లైట్లను మూడు నెలలలోగా ఏర్పాటుచేయాలని, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం జరపాలని, అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని జివిఎంసి కమిషనర్‌కు సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ, సింహాచలం బిఆర్‌టిఎస్ రోడ్డు నిర్మాణానికి ఉన్న అవరోదాలను అధిగమించి పూర్తి చేయాలన్నారు. దీనికి సంబంధించి 900 మీటర్ల పరిధిలో భూ సమస్య , 1.1 కి.మీలో స్ట్రక్చర్స్ గుర్తించామని వీరికి నష్ట పరిహారం సమస్య త్వరలో పరిష్కారమవుతుందని చెప్పారు. 4 నియోజకవర్గాలలో రోడ్ల పనులను గుర్తించి త్వరలో పూర్తిచేయాలని జివిఎంసి చీఫ్ సిటీ ప్లానర్‌ను ఆదేశించారు. రోడ్లలో వీధి దీపాలు, మంచి నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు.
భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వీధి లైట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయ్యాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వీధి లైట్లకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను కేటాయించాలని జివిఎంసి కమిషనర్‌ను కోరారు. భీమిలి నియోజకవర్గంలో కొత్తగా సిహెచ్‌సి ఏర్పాటు చేసి వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో 85, 87వ వార్డుల్లో వీధి దీపాలు, తాగునీరు సమస్య అధికంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని, మున్సిపల్ నీటి కుళాయిల విడుదల సమయాన్ని ఒక గంట పాటు పెంచాలని కోరారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, పాడు పడిన ప్రియదర్శిని స్టేడియం భవనాన్ని పునర్నిర్మించాలని, కనకమహాలక్ష్మి దేవాలయం పరిసరాలను, రోడ్డును విస్తరించాలని కోరారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో పలు రోడ్డు పనులు పెండింగులో ఉన్నాయని, వాటిని పూర్తిచేయాలని, సుజాతనగర్‌లో పందుల సమస్యను పరిష్కరించాలని కోరారు. విఎమ్‌ఆర్‌డిఎ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ, అరిలోవ, యూనివర్సిటీలో పలు చోట్ల అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, పోలీస్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ, యుఎల్‌సి భూములలో ఇల్లు కట్టుకున్న వారు గతంలో ఇచ్చిన జీవోలో ఫీజులు చాలా అధికంగా ఉన్నందున ఇప్పుడు స్లాబ్ సిస్టం ద్వారా టైటిల్ డీడ్ పొందుటకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ సమీక్షలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర, ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వేపాడ చిరంజీవిరావు, డిసిఎంఎస్ చైర్‌పర్సన్ పల్లా చిన్నతల్లి, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










