Oct 06,2023 22:59

బెలూన్లు ఎగురవేసి క్రీడల్ని ప్రారంభిస్త్ను కలెక్టర్‌, డిఆర్‌ఎం ఇతర అధికారులు

ప్రజాశక్తి-గుంటూరు : క్రీడలు శారీరక, మానసిక ధృడత్వానికి ఎంతో దోహదపడతాయని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లపాడులోని డిఆర్‌ఎం మైదానంలో గుంటూరు రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో డిఆర్‌ఎం కప్‌-2023 శుక్రవారం ప్రారంభమైంది. గుంటూరు డివిజన్‌ రైల్వే మేనేజరు రామకృష్ణతో కలసి పాల్గొన్న కలెక్టర్‌ బెలూన్లూ ఎగరవేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. డీఆర్‌ఎం బౌలింగ్‌ వేయగా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి బ్యాటింగ్‌ చేస్తు కొద్దిసేపు క్రికెట్‌ ఆడారు. ప్రారంభ సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ కొంత కాలంగా మంచి ఉద్యోగాలలో స్ధిరపడాలనే ఉద్దేశ్యంతో విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకే పూర్తి సమయం కేటాయించి క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం క్రీడల ప్రాధాన్యం తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆటల్లో పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. రైల్వేశాఖ ఉద్యోగులతోపాటు, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులలో క్రీడాస్ఫూర్తి పెంపొదించటానికి తొలిసారిగా డీఆర్‌ఎం కప్‌ 2023ను నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. డిఆర్‌ఎం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సత్ససంబంధాలు పెంపొందించాలనే లక్ష్యంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనటం వల్ల క్రీడాస్ఫూర్తితో పాటు, టీమ్‌ స్పిరిట్‌ పెంపొందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాలు, తెలంగాణాలోని రెండు జిల్లాల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్‌లో 13 టీంలు, వాలీబాల్‌లో 15 టీంలు, బ్యాడ్మింటన్‌లో 25 టీంలు పాల్గొననున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎడిఆర్‌ఎంలు సైమన్‌, శ్రీనివాస్‌, సీనియర్‌ డిసిఎం దినేష్‌ కుమార్‌, చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్లు డాక్టర్‌ లక్ష్మీ, ప్రభాకర్‌ రాజు పాల్గొన్నారు.