ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : దమన్‌జోడి, లక్ష్మీపూర్ రోడ్ రైల్వేస్టేషన్లలో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి, విభాగంలో భద్రతా అంశాలను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తనిఖీ చేశారు. సీనియర్ అధికారులతో కలిసి దమన్‌జోడి స్టేషన్‌ను డిఆర్‌ఎం పరిశీలించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రయాణికుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సర్క్యులేటింగ్ ఏరియా, స్టేషన్ బిల్డింగ్ అభివృద్ధిని సమీక్షించారు. అనంతరం డివిజనల్, కన్‌స్ట్రక్షన్ అధికారులతో కలిసి దమంజోడి - బైగూడ సెక్షన్ యార్డులో డబ్లింగ్ పనులను పరిశీలించారు. ట్రాక్ స్లీవింగ్ ద్వారా ట్రాక్ లే-అవుట్‌ను సవరించడం, క్రాస్-ఓవర్‌ను మార్చడం, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్ ఎలక్ట్రికల్ మాస్ట్‌లను మార్చడం ద్వారా వేగాన్ని పెంచడానికి ప్రణాళికాబద్ధమైన పనులను సమీక్షించారు. లక్ష్మీపూర్ రోడ్ స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సర్క్యులేటింగ్ ఏరియా, అమత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కొత్త స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల అప్‌గ్రేడేషన్‌ను సమీక్షించారు. చివరిగా పార్వతీపురం సమీపం లోని లెవల్ క్రాసింగ్ నెంబర్ 288 వద్ద భద్రత, కార్యాచరణ అంశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గేట్‌మాన్‌తో మాట్లాడి సమస్యలనడిగి తెలుసుకున్నారు. సెక్షన్‌లో భద్రతాపరమైన అంశాలను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డిఆర్‌ఎం తెలిపారు. ఈ తనిఖీలలో ఎడిఆర్‌ఎం (ఇన్‌ఫ్రా) సుధీర్ కుమార్‌గుప్తా, సివిల్ ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.










