ప్రజాశక్తి-పాడేరు:జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రీ సర్వే లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, డిఫారం పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. డి ఫారం పట్టాలు పంపిణీ, భూముల రీ సర్వే, పివిటిజి ఓటర్ల నమోదు ప్రక్రియ పై అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు డి ఫారం పట్టాలు పంపిణీకి రెవెన్యూ అధికారులు సన్నద్దం కావాలని స్పష్టం చేసారు. ఇప్పటికే ఎస్సైన్‌మెంట్ కమిటీ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఏ సమయం లోనైనా ఎస్సైన్‌మెంట్ కమిటీ సమావేశం జరగవచ్చని చెప్పారు. ఎస్సైన్‌మెంట్ కమిటీ వేసే ప్రశ్నలకు తహశీల్దారులు సమాధానాలు చెప్పవలసి ఉంటుందన్నారు. గిరిజన రైతులు డి ఫారం పట్టాల కోసం విఆర్‌ఓలను, తహశీల్దారులను సంప్రదించాలని సూచించారు. గిరిజన రైతులకు మాత్రమే డి ఫారం పట్టాలు అందించడానికి భూములు గుర్తించాలన్నారు. డి ఫారం పట్టా భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తే రైతు భరోసా, పంటల రాయితీలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. రీ సర్వేలో సబ్ డివిజన్ పెండింగ్ ఉండకూడదన్నారు. వచ్చే నెల 10వ తేదీ నాటికి మ్యుటేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఫారం 7 పత్రాలను ఎంపిడిఓల నుండి సేకరించి వచ్చే 10 రోజుల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అర్హులైన ప్రతీ పివిటిజికి ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని చెప్పారు. పివిటిజి ఓటరు నమోదు పక్కాగా జరగాలన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రాలు, అడంగల్ పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికేట్ల జారీ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, సబ్ కలెక్టర్ వి.అభిషేక్, డిఆర్‌ఓ పి.అంబేద్కర్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు వై. మోహనరావు, తహశీల్దారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.










