May 15,2023 23:56

మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: డి పట్టా భూముల పంపిణీకి లబ్దిదారుల గుర్తింపును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో కలెక్టర్‌ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుండి వీడియో సోమవారం కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీసర్వే, డి.పట్టా భూముల గుర్తింపు, పివిటిజి ఓటర్ల నమోదు, స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై సమీక్షించారు. రెండు నెలల నుండి 2502 గ్రామాలకు గాను 169 గ్రామాల్లో మాత్రమే డి పట్టా భూములను గుర్తించారని చెప్పారు. విఆర్‌ఓల పనితీరు మార్చుకోవాలని, డి పట్టా భూములు గుర్తింపులో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూములు రీసర్వే చేసేటప్పుడు సంబంధిత షెడ్యూలును అటవీ శాఖ అధికారులకు పంపించి రీసర్వే పై సమాచారం అందిస్తే రీ సర్వేలో ఆ శాఖ అధికారులు పాల్గొంటారని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. 293 గ్రామాల్లో వెక్టరైజేషన్‌ ప్రక్రియ జరుగుతోందని, 250 గ్రామాల్లో పూర్తయ్యిందని చెప్పారు. 240 గ్రామాల్లో సర్వే డేటా అప్లోడ్‌ చేయాలన్నారు. డేటా నమోదు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఫారం 7,10 సేకరణ త్వరితగతిన చేయాలని పేర్కొన్నారు. పెండింగ్‌ మ్యుటేషన్లపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలని స్పష్టం చేసారు. మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తే రైతులకు రైతు భరోసా పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వి ఆర్‌ఓలు సక్రమంగా పనిచేయకుంటే జీతాలు నిలుపుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, డి ఆర్‌ఓ పి.అంబేద్కర్‌, 22 మండలాల తహశీల్దారులు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.