Sep 12,2023 21:26

తమ వద్ద ఉన్న రికార్డులను చూపిస్తున్న రైతులు

ప్రజాశక్తి - వేపాడ : మండలంలోని వీలుపర్తి రెవెన్యూ పరిధిలోగల డి పట్టా భూముల సర్వే చేయడానికి వచ్చిన సిబ్బంది తెచ్చిన జాబితాలో కొంత మంది రైతులు పేర్లే ఉన్నాయని చాలా మంది రైతులు పేర్లు లేవని రైతులు మంగళవారం వాపోయారు. ఆ భూములకు సంబంధించిన పట్టాదారుల పేర్లు జాబితాలో లేవని రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబరు 2,3,4,5,6లలో 48 ఎకరాల భూమిని 36 మంది రైతులకు ఇచ్చారన్నారు. 42 ఎకరాల భూములకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లు పరిశీలనకు రాలేదని ఈ జాబితా పూర్తిగా అవాస్తవమని రైతులు మండిపడ్డారు. పట్టా, సాగులో ఉన్న రైతులు పేర్లు జాబితాలో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుడైన బోసు రాజుకు తమ భూములను కౌలకు ఇవ్వడం వాస్తవమేనని అయితే కౌలు షరతులు ముగియడంతో తమ భూమి తామే సాగు చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. వాస్తవాలు బయటకు రావాలంటే జిల్లా సర్వేయర్‌, మండల సర్వేయర్‌ సంయుక్తంగా సర్వే చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. దీంతో సర్వేకు వచ్చిన విఆర్‌ఒ మిరియాల వెంకటరావు, విఆర్‌ఎ రాము, సచివాలయం సర్వేయర్‌కు రైతులు గోకాడ అచ్చంనాయుడు, భూషణం, జామి అప్పలనాయుడు, సేనాపతి సత్యం, ఏడవక అప్పలనాయుడు మొరపెట్టుకున్నారు.