ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
'పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప'.. అక్షరాలా నిజమయ్యింది చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామ దళితుల విషయంలో.. అందరిలా తాను మనిషినేనని, తనకు ఎందుకు కటింగ్, షేవింగ్ చేయరని ఓ యువ దళితుడు ప్రశ్నించాడు.. 'దళితులకు క్షౌరం చేస్తే మీ షాపులకు మేం రాబోం' అని పెత్తందారులు హుకుం జారీ చేశారని, ఈ కారణంగానే తప్ప తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఊరి పెద్దల మాటకు కట్టుబడి క్షౌరం చేయడానికి నిరాకరించాడు క్షౌరవృత్తిదారుడు.. దీంతో ఆగ్రహించిన దళితుడు ఊళ్లోకి వెళ్లి దళితులను చైతన్యపరచి ఎస్‌ఐకి, తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఉన్నతాధికారులు గ్రామసభ నిర్వహించి ఇరు వర్గాలకు సర్దిచెప్పి, పెత్తందారులను హెచ్చరించి, ఆర్‌డిఒ సాక్షిగా దళితునికి క్షౌరం చేసేలా చేయించి 'శభాష్' అనిపించుకున్నారు. పోరాట స్ఫూర్తి నింపిన దళితుల చైతన్యాన్ని బుధవారమే 'ప్రజాశక్తి' పత్రిక వెలుగులోకి తెచ్చింది. గురువారం ఉన్నతాధికారుల స్పందనతో వివక్షకు చెక్ పడింది. వివరాలిలా ఉన్నాయి.
బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల పంచాయతీ పరిధిలో కాపలనత్తం, ఓటేరుపాళ్యం, నల్లగుంట్లపల్లి, సంతపేట తదితర ఏడు గ్రామాల్లో వెయ్యి కుటుంబాలకు పైగా ఎస్సీ, ఎస్టీలు జీవనం సాగిస్తున్నారు. వీరికి రైతుల పొలాల్లో పనిచేయడం, భవన నిర్మాణ కూలీలుగా పనులు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఎకరా, అర ఎకరా డికెటి పొలం ఉన్నప్పటికీ అడవి జంతువులు పంటను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ఆ భూములను బీడుగా మార్చేశారు. దీంతో కూలీలుగా మారిపోయారు. రోజంతా కష్టపడి పనిచేస్తే రోజుకు 150 రూపాయలు కూలి ఇచ్చి, భోజనం గిట్టుబాటు అవుతుంది. ఈ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు లేకపోవడంతో రైతుల పొలాల్లోనే వీరికి పని. అయితే వెయ్యి కుటుంబాల్లో యువత కొంతమంది చదువుకున్నవారు ఉన్నారు. బైరెడ్డిపల్లి, నెల్లిపట్లలో క్షౌరం చేయించుకునే షాపులు ఉన్నాయి. దళితులు ఆ షాపుకు వస్తే తాము వచ్చి క్షౌరం చేయించుకోబోమని క్షౌరవృత్తిదారులను హెచ్చరించారు. బుధవారం నెల్లిపట్లకు చెందిన దళితుడు సౌందర్యరాజన్ కటింగ్ చేయాలని శివకుమార్ బార్బర్ షాపుకు వచ్చాడు. అయితే క్షౌరవృత్తిదారులను హెచ్చరించడంతో భయపడిన శివకుమార్ క్షౌరం చేయడానికి నిరాకరించాడు. పెత్తందారులు రాకపోతే తమ జీవనానికి ఇబ్బందని ప్రాధేయపడ్డాడు. ఇదేంటి అన్యాయం అని సౌందర్యరాజన్ ప్రశ్నించారు. ఊళ్లో దళితుల సాయంతో బైరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ మోహన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ కె.కుమారస్వామికి వినతిపత్రం సమర్పించారు.
స్పందించిన ఆర్డీవో మనోజ్‌కుమార్‌రెడ్డి
పలమనేరు ఆర్డీవో మనోజ్‌కుమార్‌రెడ్డి, తహశీల్దార్ కుమారస్వామి, ఎస్‌ఐ మోహన్‌కుమార్ గురువారం నెల్లిపట్ల గ్రామానికి చేరుకుని గ్రామసభ నిర్వహించారు. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని ఖండించారు. కటింగ్ షాపు వద్దకు నేరుగా వెళ్లి ఎస్సీలకు కటింగ్ చేయాలని దగ్గరుండి చేయించారు. అదేవిధంగా గుడిలోకి ఎస్సీలను రానివ్వడం లేదని వారికి తెలియపరచడంతో ఆ సమస్యనూ శాశ్వతంగా పరిష్కరించారు. ఇకపై దళితులపట్ల వివక్ష చూపితే సహించేది లేదని పెత్తందారులను హెచ్చరించారు.










