Oct 25,2023 21:34

డెయిరీ కార్మికుల ఘోష పట్టదా..?
బకాయి వేతనాల కోసం 43 రోజులుగా రిలే దీక్షలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:

దేశంలోనే అతిపెద్ద రెండో డెయిరీ, పాడి రైతుల కల్పతరవుగా విరాజిల్లింది చిత్తూరు విజయ సహకార డెయిరీ. అయితే అక్కడ పనిచేసిన కార్మికులు మాత్రం తమకు రావల్సిన బకాయి వేతనాల కోసం ఏళ్లతరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నేటీకీ వారు 43 రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేస్తున్నా ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. తమకు న్యాయంగా రావల్సిన బకాయి వేతనాల కోసం అన్నమో.. రామచంద్రా అంటూ కలెక్టరేట్‌ ఎదుట తిండీతిప్పలు మాని రిలే దీక్షలు చేస్తూనే ఉన్నారు.
గతంలో విజయ డెయిరీలో పనిచేసిన కార్మికులు విఆర్‌ఎస్‌ తీసుకోకుండానే తమ జీతాలను దారబోశారు. ఎప్పటికైనా డెయిరీకి పూర్వవైభం రాకపోతుందా అని ఎదురు చూశారు కానీ వారి ఆశలు అడిఆశలయ్యాయి. ప్రభుత్వం అమూల్‌ సంస్థకు ప్రభుత్వ విజయ సహకార డెయిరీ ఆస్తులను 99 సంవత్సరాలకు లీజుకు కట్టబెట్టింది. బకాయి జీతాలైనా అందుతాయని ఎదురుచూసిన కార్మికులకు నిరాశే మిగిలింది. ఇదిగో... అదిగో అంటూ అధికారులు డెయిరీ కార్మికులను ఆందోళనకు పూనుకోకుండా అడ్డుకుని అమూల్‌ సంస్థక అప్పనంగా విజయ డెయిరీ ఆస్తులను కట్టబెట్టారు. డెయిరీని సొంతం చేసుకున్న అమూల్‌ సంస్థ ఆధునీకరణ పనులను మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నా తమ బకాయి జీతాల విషయం తేల్చకపోవడంతో విధిలేని పరిస్థితిలో కార్మికులు రోడ్డెకాల్సిన స్థితి వచ్చింది.
గత నెల 12వ తేదీ నుండీ డెయిరీ కార్మికులు ఆందోళనకు పూనుకుటున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులతో సహా అమూల్‌ డెయిరీ ఆధునీకరణ పనులను అడ్డుకున్నారు. అమూల్‌ డెయిరీ ఎదుటే గుడారం వేసుకొని రిలే దీక్షలను చేపట్టారు. పోలీసులు గుడారాలు పీగేయడంతో రిలే దీక్షలను కలెక్టరేట్‌ ఎదుట కొనసాగిస్తున్నారు. బుధవారానికి ఈ దీక్షలు 43 రోజుకు చేరుకుంది.
డెయిరీ కార్మికు ఘోష..
సహకార విజయ డెయిరీ 2002లో మూతపడ్డాక అప్పటి వరకు పనిచేస్తున్న కార్మికులు విఆర్‌ఎస్‌ తీసుకోగా 140మంది కార్మికులు విఆర్‌ఎస్‌ తీసుకోకుండా నాటి నుండీ ఏనాటికైనా డెయిరీ పునఃప్రారంభిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ సంస్థకు అప్పగించడంతో డెయిరీ పునఃప్రారంభం అవుతుందని, తమ బకాయిలు చెల్లిస్తారనే ఆశ ఎంతో కాలం నిలువలేదు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహ్మన్‌రెడ్డి అమూల్‌ డెయిరీకి విజయ ఆస్తులను అప్పగిస్తూ చిత్తూరు బహిరంగ సభ నిర్వహిస్తే సిఎంను కలిసేందు వెళ్లిన సహకర విజయ డెయిరీ కార్మికుల కుటుంబాలను పోలీసులు అదుపులోకి తీసుకొని తలోదిక్కు వదిలేశారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం అలస్యంగా అర్థం చేసుకున్న కార్మికులు పెండింగ్‌ జీతాల కోసం ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చింది. విజయ సహకార డెయిరీ పనిచేసిన కార్మికులు 140 మందిలో 22 మందికి పైగా చనిపోగా మిగిలిన కార్మికులు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన జీతం బకాయిల కోసం ఆందోళన చేస్తున్నారు. గత 43రోజులుగా కార్మిక చట్టాల ప్రకారం రావాల్సిన పెండింగ్‌ బకాయిల కోసం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌, సహకార సంస్థ అధికారులు పట్టించుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ కుటుంబాలు చితికిపోయాని పిల్లల చదువులు, వివాహాలు చేయలేక అనేక మంది కార్మికులు అనారోగ్యంతో అల్లాడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.