డెస్క్ లను అమ్మిన వారిపై చర్యలు చేపట్టి సమగ్ర విచారణ జరిపించాలి - సిపిఐ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఆర్ఎస్ రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు ఇచ్చిన డెస్క్ లను అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి సమగ్ర విచారణ జరిపించాలనీ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు,జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్ లు జిల్లా కలెక్టర్ ను కోరారు. సోమవారం స్పందనలో డేస్కులను అమ్మిన విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామున్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు. మాట్లాడుతూ నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్.ఎస్ రంగాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, గత ఎనిమిది సంవత్సరాల క్రితం 10వ తరగతి పరీక్షా కేంద్రం నిర్వహణకు గాను మాజీ పార్లమెంటు సభ్యులు కీర్తిశేషులు ఎస్పీ.వై రెడ్డి గారు రెండు లక్షల రూపాయలతో 100 డేస్కులను గ్రామస్తుల కోరిక మేరకు విరాళంగా అందజేశారు. ఈ పాఠశాలకు కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు విక్టర్ ఇమ్మానుయేల్, డెస్క్ బాగా ఉన్నప్పటికీ లాభాపేక్ష దృష్టితో పై అధికారుల అనుమతి లేకుండా,వేలం వేయకుండా ,ఉపాధ్యాయుల ,విద్యాకమిటీ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి నియమా నిబంధనలు పాటించకుండా, తానే స్వయంగా 100 డేస్కులను వేరొక ప్రైవేటు పాఠశాలకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కనుక ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించి ప్రధానోపాధ్యాయుల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఆయన జీతం నుండి రికవరీ చేయుటకు గాను ఆదేశాలు ఇవ్వవలసిందిగా, జిల్లా ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.










