ప్రజాశక్తి - కురుపాం : డెంగీ నివారణ మాసోత్సవాల్లో భాగంగా కురుపాం సబ్ యూనిట్ అధికారి ఎస్. నారాయణరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నుంచి రావాడ జంక్షన్ వరకు డెంగీ నివారణపై వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఆశావర్కర్లతో కలిసి ప్రజలకు అవగాహన పరుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కురుపాం బస్టాండ్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు డెంగీ రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో మాదలింగి పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ ఎస్.సుప్రియా, హైస్కూల్ హెచ్‌ఎం టి.శంకరరావు, ఉప సర్పంచ్ షేక్ ఆదిల్, ఎంపీటీసీలు బంగారు నాయుడు, టివిఎస్ సోమయాజులు, యస్ సంస్థ డైరెక్టర్ షేక్ గౌస్, విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురంలో డ్రైడే ఫ్రైడే
గుమ్మలక్ష్మీపురం : స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కేంద్రంలో పలు వీధుల్లో మురికి కాలువలు, మంచినీటి బావుల్లో క్లోరినేషన్ చేయించి మంచినీటి బావులు చుట్టూ ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. అలాగే మంచినీటి బావుల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లించి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ, మంచినీటి బావుల ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకొని చెత్తా, చెదారం పేరుకుపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలన్నారు. మంచినీటి బావులు వద్ద మురుగు పేరుకు పోతే దోమలు వ్యాపించి పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు మంచినీటి బావులు, బోరు, మురికి కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
చిట్టపూడివలసలో ఫ్యామిలీ డాక్టర్
వీరఘట్టం : మండలంలోని చిట్టపూడివలసలో శుక్రవారం 104 ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఉమామహేశ్వరి వివిధ రకాలైన రోగులకు తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఓ.శాంతికుమారి, 104 సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










