ప్రజాశక్తి -ములగాడ : జిల్లాలో డెంగీ, చికున్‌గునియా తదితర వ్యాధుల నివారణకు ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరమని 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు అన్నారు. మల్కాపురం ఏరియా డెంగీ, మలేరియా యాంటీ ర్యాపిడ్ టీం ఆధ్వర్యాన ఎకేసీ కాలనీలో మంగళవారం సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీల్లో మలేరియా విభాగం సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ లార్వా దశలోనే దోమలను నివారిస్తున్నారన్నారు. ప్రజలు కూడా ఇళ్లలో, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు ప్రతి శుక్రవారమూ డ్రైడే పాటించాలని సూచించారు. మలేరియా, డెంగీ కారక దోమలు ఎలా వృద్ది చెందుతాయో, ఏయే ప్రదేశాలను ఆవాసాలుగా చేసుకుంటాయో తదితర విషయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం ఏరియా మలేరియా ఇన్‌స్పెక్టర్ డి.రవికుమార్, సూపర్‌వైజర్ దుల్లా శ్రీనివాసరావు, ఎఎన్‌ఎమ్ వి.విజయకుమారి, హెల్త్ అసిస్టెంట్ రోమాల వేణుబాబు, ఆశా కార్యకర్త పావని పాల్గొన్నారు.










