May 16,2023 00:06

గుంటూరులో పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : డెంగీ వ్యాధి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌.శివశంకర్‌ సూచించారు. ఈ మేరకు జాతీయ డెంగీ దినం వాల్‌పోస్టర్లను కలెక్టరేట్లలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్‌ వైజర్లు అందరు ప్రజలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. రాబోయే వర్షాకాలంలో వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున దోమల నివారణకు తీసుకోవలసిన చర్యలు సంపూర్ణంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, నీటిపై మూతలు ఉంచడంతోపాటు వాడేసిన కొబ్బరి బోండాలు, ఖాళీ పాత్రలు ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలని సూచించారు. డిఎం అడ్‌ హెచ్‌ఒలు డాక్టర్‌ శ్రావణ్‌బాబు, డాక్టర్‌ జి.శోభారాణి మాట్లాడుతూ 16న మంగళవారం జరగబోవు జాతీయ డెంగీ దినోత్సవాన్ని జిల్లా అంతటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, కరపత్రాలు, గోడ పత్రికలు పంపిణీ చేయుచున్నామని తెలిపారు. గుంటూరులో జెసి జి.రాజకుమారి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సుబ్బరాయణం డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లలిత పాల్గొనగా నరసరావుపేటలో జెసి ఎ.శ్యాంప్రసాద్‌, డిఆర్‌ఒ వినాయకం జిల్లా మలేరియా అధికారి రత్నాకర్‌ పాల్గొన్నారు.